సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కావాలని బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచందర్ రావు. సింగరేణి నైనీ కోల్ బ్లాక్ టెండర్ల అవకతవకలపై విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు దావోస్ వెళ్లి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ తీరుపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్ర కమిటీ సభ్యులకు బాధ్యతలు అప్పగించి నాలుగు నెలలు పూర్తి, అనుబంధ విభాగాల పనితీరుపై ఆయన సమీక్ష చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర కమిటీ పనితీరుపై రామచందర్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం, రామచందర్ రావు మాట్లాడుతూ.. బీజేపీ అగ్రనేతలతో రెండు ఉమ్మడి జిల్లాలకు ఒకటి చొప్పున ఐదు భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నాం. జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్ లాంటి వారి సభల కోసం బీఎల్ సంతోష్‌కి ప్రతిపాదనలు పంపాం అని అన్నారు.
ఇదే సమయంలో తెలంగాణ రాజకీయాలపై స్పందిస్తూ..‘సింగరేణి నైనీ కోల్ టెండర్ల విషయంలో రాష్ట్రం కోరితే సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధంగా ఉంది. సీబీఐకి ఇస్తే 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరగాలన్నది బీజేపీ డిమాండ్. దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ లాస్ట్ టైం వెళ్లినప్పుడు తెచ్చిన పెట్టుబడులు ఎక్కడ పెట్టారో చూపెట్టాలి. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలి. దావోస్ వెళ్లి చేస్తున్నారు?. మంచు చూడటానికి వెళ్లారా?. దావోస్ డెస్టినేషన్ మీటింగ్ అడ్డలా మారింది. పెట్టుబడులు తేవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. రెండు దావోస్ పర్యటనల్లో వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యం చెందాయి కాబట్టి ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు.


