
రోహిత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిన వారికి ఉన్నత పదవులా?
ఇప్పటి బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు... అప్పుడు హెచ్‌సీయూ వద్ద ధర్నా చేసి రోహిత్‌పై ఒత్తిడి తెచ్చారు
దళితులను ఇబ్బందిపెట్టే వారికి బీజేపీ పట్టం కడుతోంది
ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సాక్షి, న్యూఢిల్లీ: పరిశోధక విద్యార్థి రోహిత్ వేములను ఆత్మహత్యకు ప్రేరేపించిన వారికి బీజేపీ పెద్దపీట వేసి, ఉన్నత పదవులను కట్టబెట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. అప్పట్లో ఎమ్మెల్సీగా ఉన్న ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు హెచ్‌సీయూ ఎదుట ఆందోళన చేశారని గుర్తు చేశారు. రాంచందర్‌రావు ఒత్తిడి కారణంగా ఆ సమయంలో అంబేడ్కర్ స్టూడెంట్ అసోసియేషన్‌లో ఉన్న విద్యార్థులపై యూనివర్సిటీ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇంతటి ఘటనకు కారకుడైన రాంచందర్‌రావుపై చర్యలు తీసుకోకుండా అధ్యక్ష పదవి ఇచ్చి న బీజేపీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం ఢిల్లీలోని ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ రాజేంద్ర పాల్ గౌతమ్‌తో కలిసి భట్టి మీడియాతో మాట్లాడారు. రోహిత్ వేముల కేసును తాము పునర్విచారణ చేసేందుకు కోర్టును ఆశ్రయించినట్లు భట్టి చెప్పారు. అతని మృతికి కారకులైన వారిని వదిలేది లేదని హెచ్చరించారు. రోహిత్ ఆత్మహత్య వంటి ఘటనలు దేశంలో పునరావృతం కాకుండా ఉండేందుకు ముందుగా రాష్ట్రంలో ప్రత్యేక చట్టాన్ని తెస్తున్నట్లు చెప్పారు.
పదవులు కట్టబెడతారా?
‘హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్లు తీసుకునే దళిత విద్యార్థులందరికీ అడ్మిషన్‌తోపాటు ఇంత విషం, ఒక తాడును కూడా ఇస్తే ఉరి వేసుకోవడానికి పనికొస్తుందని రోహిత్ వేముల వీసీకి రాసిన సూసైడ్ నోట్‌లో ఉంది. అప్పట్లో ఈ సూసైడ్ నోట్ దేశ ప్రజల మనసులను కలచివేసింది. వర్సిటీలో ఆత్మగౌరవంతో బతకడానికి కావలసిన హక్కులు కల్పించండి అంటూ అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ యూనివర్సిటీలో జరుగుతున్న ఘటనలపై వీసీకి వినతి పత్రం ఇచ్చి ంది. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని వర్సిటీ ఏబీవీపీ యూనిట్ అధ్యక్షుడు సుశీల్ కుమార్.. రోహిత్‌తోపాటు మరో నలుగురు అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ వీసీకి ఫిర్యాదు చేశారు.
ఆ నలుగురిపై పోలీసు కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని వీసీపై ఒత్తిడి తీసుకురావడమే కాకుండా, కేంద్ర మానవ వనరుల శాఖ నుంచి నుంచి వీసీపై ఒత్తిడి తెచ్చారు. అదే సమయంలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ఒత్తిడి తేవడంతో పోలీసులు యూనియన్ సభ్యులపై కేసులు నమోదు చేశారు. నలుమూలల నుంచి వచ్చి న ఒత్తిడిని తట్టుకోలేక వర్సిటీ అధికారులు రోహిత్‌తోపాటు మరో నలుగురిని సస్పెండ్ చేయడంతో గత్యంతరం లేక రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డారు’అని భట్టి విక్రమార్క చెప్పారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు నమోదు చేయించిన నాటి ఎమ్మెల్సీ రాంచందర్‌రావును ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారని, రోహిత్ ఆత్మహత్యకు ప్రధాన కారకుడుగా భావిస్తున్న సుశీల్ కుమార్‌ను ఢిల్లీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమించారని మండిపడ్డారు.
మా ప్రభుత్వంలో ఇబ్బందుల్లేవు
పవర్ షేరింగ్ అనేది లేదు.. అందరం కలిసి పనిచేస్తున్నాం
బీఆర్‌ఎస్ నేతల మాటలు మితిమీరాయి: భట్టి
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో బీఆర్‌ఎస్ నేతలు మితిమీరి వ్యాఖ్యలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో, వారి నిర్ణయం ఏంటనేది వారికే తెలియదన్నారు. వీటిపై తాము ప్రశి్నస్తే.. మితిమీరిన మాటలు మాట్లాడుతూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో భట్టి మీడియాతో చిట్‌చాట్ చేశారు.
‘మా ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. పవర్ షేరింగ్ అనేది ఏమీ లేదు. అందరం కలిసి టీం వర్క్‌గా పనిచేస్తున్నాం. మా ప్రభుత్వం బాగుంది. ఎన్నికల్లో ఇచ్చి న హామీలను ఒక్కోటి పూర్తిస్థాయిలో అమలు చేస్తూ ముందుకెళ్తున్నాం. ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాం. మహిళలకు ఉచిత బస్సు క్లిక్ అయ్యింది.. ఎంచక్కా మహిళలంతా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నాం. ఫోర్త్‌సిటీ పనులు జరుగుతున్నాయి, మూసీ సుందరీకరణను కచ్చితంగా ఈ హయాంలోనే పూర్తి చేస్తాం. రీజినల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ రాదు. బీజేపీ వాళ్ల మాటలు వినడం ప్రజలు ఎప్పుడో మానేశారు’అని భట్టి అన్నారు.