శానిట‌రీ ప్యాడ్ల ఫ్యాక్ట‌రీపై బీఐఎస్ దాడులు | bis raids in sanitary pads factory at hyderabad | Sakshi
Sakshi News home page

శానిట‌రీ ప్యాడ్ల ఫ్యాక్ట‌రీపై బీఐఎస్ దాడులు

Apr 22 2025 1:41 PM | Updated on Apr 22 2025 3:10 PM

bis raids in sanitary pads factory at hyderabad

- ఐఎస్ఐ ముద్ర‌ లేని 30 వేల‌ శానిట‌రీ ప్యాడ్లు జ‌ప్తు 
 

హైదరాబాద్: ఐఎస్ఐ మార్కు లేని శానిట‌రీ ప్యాడ్లు స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ ఓ కేంద్రంపై బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్, హైద‌రాబాద్ శాఖ అధికారులు దాడులు నిర్వ‌హించారు. సోమ‌వారం, కుషాయిగూడలోని ఓ కేంద్రంలో జ‌రిగిన సోదాల్లో అమ్మ‌కానికి సిద్ధంగా ఉన్న 30 వేల‌ ప్యాడ్లు, 7వేలకు పైగా లేబుల్ క‌వ‌ర్లకు ఐఎస్ఐ మార్కు లేన‌ట్లు గుర్తించిన అధికారులు వాట‌న్నింటినీ జ‌ప్తు చేశారు.

మ‌హిళ‌ల ఆరోగ్య ర‌క్ష‌ణ కోసం ఐఎస్ 5405:2019 ప్ర‌మాణాలున్న శానిట‌రీ ప్యాడ్ల‌ను భార‌త ప్ర‌భుత్వం క్వాలిటీ కంట్రోల్ ఆర్డ‌ర్ గెజిట్ ద్వారా బీఐఎస్ ధ్రువీక‌ర‌ణ త‌ప్ప‌నిస‌రి చేసింది. బీఐఎస్ ధ్రువీక‌ర‌ణ పొంద‌కుండా అమ్మినా, త‌యారు చేసినా, నిల్వ చేసినా క‌ఠిన‌ చ‌ర్య‌లు తీసుకునేలా ఆదేశించింది. అయితే, ఈ కేంద్రంలో ఎలాంటి ధ్రువీక‌ర‌ణ లేకుండా పెద్ద ఎత్తున‌ శానిట‌రీ న్యాప్‌కిన్లు నిల్వ ఉంచిన‌ట్లు స‌మాచారం అందడంతో అంద‌డంతో సోదాలు నిర్వ‌హించిన‌ట్లు బీఐఎస్ హైద‌రాబాద్ శాఖ అధిప‌తి, సంచాల‌కులు పీవీ శ్రీకాంత్ తెలిపారు. జాయింట్ డైరెక్ట‌ర్లు సవిత‌, రాకేశ్ త‌న్నీరు ఆధ్వ‌ర్యంలో బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి.

బీఐఎస్ చ‌ట్టం 2016లోని ప‌లు సెక్ష‌న్ 17 ప్ర‌కారం భార‌త ప్ర‌భుత్వం బీఐఎస్ ధ్రువీక‌ర‌ణ త‌ప్ప‌నిస‌రి చేసిన ఉత్ప‌త్తులేవీ ఐఎస్ఐ మార్కు, ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులకు రిజిస్ట్రేష‌న్ మార్కు లేకుండా, బీఐఎస్ అనుమ‌తి పొంద‌కుండా త‌యారు చేసినా, విక్ర‌యించినా, నిల్వ చేసినా రెండేళ్ల జైలు శిక్ష‌, రూ.2ల‌క్ష‌ల జ‌రిమానా మొద‌టిసారి, ఐదేళ్ల జైలు శిక్ష‌, రూ.5ల‌క్ష‌ల వ‌ర‌కూ జ‌రిమానా రెండోసారి, త‌దుప‌రి దీనికి ప‌దిరెట్ల వ‌ర‌కూ శిక్ష ప‌డే అవ‌కాశం ఉంది. 

ఇప్ప‌టివ‌ర‌కు భార‌త ప్ర‌భుత్వం 679 ఉత్ప‌త్తుల‌ను త‌ప్ప‌నిస‌రి చేస్తూ ప‌లు క్వాలిటీ కంట్రోల్ ఆర్డ‌ర్లు విడుద‌ల చేసింది. వీటిని ఎవ‌రు ఉల్లంఘించినా క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని బీఐఎస్ హైద‌రాబాద్ శాఖాధిప‌తి పీవీ శ్రీకాంత్ వెల్లడించారు. భార‌తీయ ప్ర‌మాణాల‌పై ప్ర‌తీ ఒక్క వినియోగ‌దారుడూ అవ‌గాహ‌న క‌లిగి ఉండాల‌ని, బీఐఎస్ కేర్ యాప్ ద్వారా వ‌స్తువుల నాణ్య‌తా ప్ర‌మాణాలను గుర్తించాల‌ని, ఉల్లంఘ‌న‌ల‌ను గుర్తిస్తే అదే యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయాల‌ని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement