తుమ్మిళ్ల ఇసుక రీచ్‌లో ఏపీ టీడీపీ మూకల దాడి | AP TDP mob attacks in Tummilla Sand Reach | Sakshi
Sakshi News home page

తుమ్మిళ్ల ఇసుక రీచ్‌లో ఏపీ టీడీపీ మూకల దాడి

Jun 23 2026 5:28 AM | Updated on Jun 23 2026 5:28 AM

AP TDP mob attacks in Tummilla Sand Reach

బాలకృష్ణతో ఠాగూర్, అడుసుమిల్లి శ్రీధర్‌

సైట్‌ ఇంజనీర్‌పై విచక్షణా రహితంగా పిడిగుద్దులు

చంపేస్తామంటూ బెదిరింపులు 

ఇది ఠాగూర్‌ అన్న ఆర్డర్‌ అంటూ క్యాష్‌ బ్యాగ్‌ తీసుకెళ్లిన దుండగులు 

దాడి చేసిన వారిలో గుంటూరుకు చెందిన శ్రీధర్‌ అనే టీడీపీ

నాయకుడిని గుర్తించినట్లు తెలిపిన బాధితుడు 

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌కు చెందిన ఠాగూర్‌ హిందూపూర్‌

టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సన్నిహితుడు!

రాజోళి: జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం తుమ్మిళ్లలో టీజీ ఎండీసీ ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ మూక దౌర్జన్యానికి తెగబడింది. సైట్‌ ఇన్‌చార్జిపై దాడి చేసింది. కింద పడేసి పిడి గుద్దులు గుద్దుతూ, కాళ్లతో తన్నడమే కాకుండా చంపేస్తామంటూ దుండగులు బెదిరించారు. ‘సోమవారం మధ్యాహ్నం రెండు కార్లలో వచ్చిన ఆరుగురు దుండగులు..సాయంత్రంలోగా నిన్ను చంపేస్తాం. ఇదే మా ఠాగూర్‌ అన్న ఆర్డర్‌ అంటూ అక్కడ ఉన్న బ్యాగ్‌ను తీసుకెళ్లారు. ఆ బ్యాగులో ఇసుక రీచ్‌ స్టాక్‌ బుక్కులతో పాటు, రూ.4 లక్షల నగదు ఉంది..’ అని దాడికి గురైన సైట్‌ ఇన్‌చార్జి లక్ష్మీనారాయణ చౌదరి తెలిపారు. దాడి చేసిన వారిలో  గుంటూరుకు చెందిన అడుసుమిల్లి శ్రీధర్‌ అనే వ్యక్తిని తాము గుర్తు పట్టామని చెప్పారు.  

వ్యాపార సంబంధమైన గొడవలతో..? 
తుమ్మిళ్ల ఇసుక రీచ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో స్థానిక ప్రజల అవసరాలు తీరుస్తున్నారు. ఏపీకే చెందిన ప్రసాద్‌ అనే కాంట్రాక్టర్‌ దీన్ని నిర్వహిస్తున్నాడు. కాగా ఠాగూర్‌ అనే వ్యక్తితో ప్రసాద్‌కున్న వ్యాపార సంబంధమైన గొడవలే దాడికి కారణమని తెలిసింది. ఈ దాడిపై రాజోళి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు లక్ష్మీనారాయణ తెలిపారు. అడుసుమిల్లి శ్రీధర్‌ ఏపీలో స్థానిక టీడీపీ నాయకుడని చెప్పారు. కాగా ఠాగూర్‌ హస్తంతోనే తనపై దాడి జరిగినట్లు లక్ష్మీనారాయణ తన  ఫిర్యాదులో పేర్కొన్నారు. ఠాగూర్‌ ఏపీలోని హిందూపూర్‌ టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణకు సన్నిహితుడని అంటున్నారు. ఈయన హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ నివసిస్తున్నట్టు సమాచారం. 

జిల్లాలో కలకలం 
సోమవారం జరిగిన ఈ దాడి జిల్లాలో కలకలం సృష్టించింది. కొద్దిరోజుల కిందట కర్నూలుకు చెందిన నాయకులు వారి వెనక వాహనాల్లో వందలమంది అనుచరులను తీసుకొచ్చి, నదిలో ఇసుక తీయొద్దని, ప్రభుత్వ అధికారులకే వార్నింగ్‌ ఇచ్చారని, ప్రస్తుతం గుంటూరుకు చెందిన కొందరు ఇలా వచ్చి దాడికి తెగబడ్డారని చెబుతున్నారు. అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామని, విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని రాజోళి ఎస్‌ఐ గోకారి తెలిపారు. అయితే  ఇసుక రీచ్‌లోని తన సిబ్బందిపై దాడి ఘటనపై కేసు నమోదు చేయకపోతే మంగళవారం జిల్లా పోలీసు ఉన్నతాధికారులను కలిసి అన్ని విషయాలు బయటకు వెల్లడిస్తానని కాంట్రాక్టర్‌ ప్రసాద్‌ తెలిపారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement