చివ్వెంల (సూర్యాపేట): ప్రేమ పేరుతో నమ్మించి మైనర్ బాలికపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడిన నిందితునికి 35 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ సూర్యాపేట జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి పి.శివరామ్‌ప్రసాద్ మంగళవారం తీర్పు వెల్లడించారు. సూర్యాపేట పట్టణానికి చెందిన మైనర్ బాలికతో, భగత్‌సింగ్‌నగర్ ప్రాంతానికి చెందిన కొమ్ము దయాకర్ ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం పెంచుకుని, ప్రేమిస్తున్నానని చెప్పి నమ్మించాడు. 2023 జూన్ 2న బాలిక తన చిన్నమ్మ ఇంటికి వెళ్లింది. ఆరోజు రాత్రి బాలిక ఉన్న ఇంట్లోకి దయాకర్ చొరబడి అత్యాచారం చేశాడు.
తర్వాత కూడా పలుమార్లు బాలిక ఇంట్లో, సూర్యాపేటలోని ఓ లాడ్జ్‌లో ఆమెపై అత్యాచారం చేశాడు. 2023 జూలై 17న బాలికను ఆమె ఇంటినుంచి తీసుకువెళ్లాడు. తొలుత ఖమ్మంకు వెళ్లి, తర్వాత విజయవాడకు చేరుకున్నారు. అక్కడ దయాకర్ స్నేహితుడి రూమ్‌లో ఉంటూ, అక్కడే ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో బాలికకు తాళి కట్టి, రెండు రోజులపాటు స్నేహితుడి రూమ్‌లోనే ఉన్నారు. కుమార్తె కనిపించకపోవడంతో తండ్రి స్థానిక పోలిస్ స్టేషన్లో పిర్యాదు చేశాడు.
విషయం తెలుసుకున్న దయాకర్ బాలికను సూర్యాపేటకు తీసుకొచ్చి వాళ్ల ఇంటికి దగ్గరలో వదిలి వెళ్లిపోయాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. పలువురు సాక్షులను విచారించిన న్యాయమూర్తి.. నిందితునికి 35 సంవత్సరాల జైలు శిక్షతో పాటు, రూ.7 లక్షలు బాధితురాలికి డీఎల్ఎస్ఎ ద్వారా చెల్లించాలని తీర్పు వెల్లడించారు.


