ఇండియా కూటమిలో రాజకీయ వార్‌ | - | Sakshi
Sakshi News home page

ఇండియా కూటమిలో రాజకీయ వార్‌

Mar 26 2026 11:41 AM | Updated on Mar 26 2026 5:06 PM

-

మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి

ఆరు చోట్ల డీఎంకే, కాంగ్రెస్‌ ప్రత్యక్ష పోటీ 

నామినేషన్ల ఉప సంహరణకు అభ్యర్థుల నిరాకరణ

కూటమి చిన్నాభిన్నం అయ్యే అవకాశం

సాక్షి, చైన్నె: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని ఇండియా కూటమిలో రాజకీయ వార్‌ తారా స్థాయికి చేరింది. ఆరు స్థానాలలో ఇరు పార్టీలు పోటీకి సిద్ధమయ్యారు. నామినేషన్లు ఉపసంహరించుకునేందు ఇరు పార్టీల తరపున అభ్యర్థులు ముందుకు రాక పోవడంతో కూటమి చిన్నా భిన్నమయ్యే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వివరాలు.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఇండియా కూటమిలో వివాదం కొనసాగుతూనే ఉంది. 

సీట్ల సర్దుబాటుకు ముందుగా ఇక్కడి 30 స్థానాలలో డీఎంకే, కాంగ్రెస్‌ కూటమి తరపున నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. చివరకు నామినేషన్ల ప్రక్రియ ముగిసినానంతరం సీట్ల సర్దుబాటు జరిగింది. ఇందులో 16 చోట్ల కాంగ్రెస్‌, 14 చోట్ల డీఎంకే పోటీ చేస్తున్నది. ఇందులో ఓ స్థానం వీసీకేకు డీఎంకే అప్పగించింది. సీట్ల పంపకాలు ముగిసినప్పటికీ, ఆరు స్థానాలు కూటమి చిన్నాభిన్నంకు పరిస్థితులను కల్పిస్తున్నాయి. ఈ ఆరు స్థానాలలో కాంగ్రెస్‌, డీఎంకే నామినేషను బుధవారం జరిగిన పరిశీలనలో ఆమోదించారు. గురువారం ఉపసంహరణ ప్రక్రియ జరగనున్నది.

కుదరని ఏకాభిప్రాయం
కూటమిలో ఏకాభిప్రయం కుదరక పోవడంతో సీపీఐ ఒంటరిగా పోటీ అని ప్రకటించి, తట్టాం చావడి, ఉలవర్కరై స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టేసింది. ఇక వీసీకే తరపున ఉలవర్కరై, ఉసుడు, తిరుభువనం నియోజకవర్గాలలో నామినేషన్లు దాఖలు చేసిన వాళ్లు ఉపసంహరణకు ముందుకు రాక పోవడం చర్చకు దారి తీసింది. ఇదే తరహా పోరు అన్నడి డీఎంకే, కాంగ్రెస్‌లోనూ నెలకొంది. డీఎంకేకు కేటాయించిన కాలపట్టు, రాజ్‌భవన్‌, నెల్లి తోపు, మంగళం, తిరుభువనం తో పాటుగా మరో నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నాయకులు కూడా నామినేషన్లు వేశారు. తాజాగా వీరు ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో డీఎంకే ఇరకాటంలో పడ్డట్లయ్యింది. 

గురువారం నామినేషన్లు ఉపసంహరించుకోని పక్షంలో రెండు పార్టీలు తలబడేందుకు సిద్ధమయ్యాయి. ఫ్రెండ్లీ సమరంగా ఈ ఆరు స్థానాలలో పోటీ ఉంటుందని కాంగ్రెస్‌ ప్రతినిధులు పేర్కొనడం గమనార్హం. అయితే దీనిని డీఎంకే అంగీకరించే పరిస్థితులలో లేదు. అదే సమయంలో కాంగ్రెస్‌ ముఖ్య నేతలు పోటీలో ఉన్న స్థానాలలో తమ తరపున నామినేషన్లు వేసిన వారి చేత ఉపసంహరింప చేయకుండా డీఎంకే ఎత్తుకు పై ఎత్తు వేస్తుండటంతో పుదుచ్చేరి ఇండియా కూటమిలో రాజకీయ సంక్షోభం అన్నది బయలు దేరి నట్టైంది. కూటమి చీలకుండా కాంగ్రెస్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌ గిరీశ్‌ చోదన్కర్‌ తదితరులు కాంగ్రెస్‌ నేతలతో సమాలోచనలో ఉన్నారు.

నాకు వ్యతిరేకంగా కుట్ర
మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామికి సీటు నిరాకరించడం కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చు పెట్టిన విషయం తెలిసిందే. తనకు నెల్లి తోపు నియోజకవర్గం దక్కకుండా రాష్ట్ర అధ్యక్షుడు వైద్యలింగం కుట్ర పన్నారని నారాయణ స్వామి బహిరంగంగా విమర్శించారు. నారాయణస్వామి మద్దతుదారులు కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నిరసన కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో నారాయణస్వామి తన ఆవేదనను వ్యక్తం చేస్తూ పార్టీని కాపాడటమే తన లక్ష్యం. ఒక నాయకుడు తనపై కుట్ర పన్నారని, కూటమి బలంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్టు వ్యాఖ్యలు చేశారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం అని వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement