సుప్రీంకోర‍్టును ఆశ్రయించిన విజయ్ టీవీకే | MLA Srinivasa Sethupathi TVK moves Supreme Court | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర‍్టును ఆశ్రయించిన విజయ్ టీవీకే

May 12 2026 4:44 PM | Updated on May 12 2026 5:47 PM

MLA Srinivasa Sethupathi TVK moves Supreme Court

ఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో టీవీకే నేత, తిరుపత్తూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్‌.శ్రీనివాస సేతుపతితో పిటిషన్ దాఖలు చేయించింది. అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ సమయంలో ఓటు వేయకుండా సేతుపతిపై హైకోర్టు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. 

తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే నేత పెరియకరుప్పన్‌పై కేవలం ఒక్క ఓటు తేడాతో గెలిచారు సేతుపతి. స్వల్ప మెజారిటీపై ప్రత్యర్థి ఫిర్యాదు చేయడంతో సేతుపతి ఓటు హక్కుపై న్యాయస్థానం ఆంక్షలు విధించింది. దీంతో ప్రజాప్రతినిధిగా తన హక్కులను కాపాడాలని సుప్రీంకోర్టును కోరారు సేతుపతి. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

కాగా, మంగళవారం జరగనున్న అసెంబ్లీ విశ్వాస పరీక్షలో పాల్గొనకుండా టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతిని మద్రాస్ హైకోర్టు ఆదేశించడంతో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. బ్యాలెట్ ఓటులో మార్పులు జరిగాయని ఆరోపిస్తూ, ఎమ్మెల్యేగా సేతుపతి బాధ్యతలు చేపట్టకుండా ఆపాలని కేఆర్ పెరియకరుప్పన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరుగుతున్న సమయంలో హైకోర్టు నుంచి ఆంక్షలు విధిస్తూ ఈ ఉత్తర్వులు వచ్చాయి.

పిటిషన్ ప్రకారం.. తిరుపత్తూర్ నియోజకవర్గం నం.185లో నమోదు కావాల్సిన ఓటును వెల్లూరు జిల్లాలోని తిరుపత్తూర్ నియోజకవర్గం నం.50కు మార్చినట్టు ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదుపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ పెరియకరుప్పన్ హైకోర్టును ఆశ్రయించారు. 

విచారణ సమయంలో, ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత బ్యాలెట్ వ్యత్యాసాలపై ఫిర్యాదు వస్తే నిబంధనల ప్రకారం చర్యలు అవసరం లేదని ఎన్నికల సంఘం తెలిపింది. ఒక్క ఓటును కూడా మరో నియోజకవర్గానికి మార్చలేదని సంఘం వెల్లడించింది. అయితే, పెరియకరుప్పన్ సమర్పించిన ఫిర్యాదుకు మద్దతుగా సరిపడా ఆధారాలు ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎమ్మెల్యేగా అసెంబ్లీ విశ్వాస పరీక్షలో పాల్గొనకుండా శ్రీనివాస సేతుపతిపై హైకోర్టు ఆంక్షలు విధించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement