దశల వారీగా హామీలన్నీ అమలు
● ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడంఆదాయ పెంపే లక్ష్యం ● అసెంబ్లీలో టీవీకే సర్కారు తొలి బడ్జెట్ దాఖలు ● సమర్పించిన ఆర్థికశాఖ మంత్రి మరియా విల్సన్
సాక్షి, చైన్నె: ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తూ, రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించేందుకు తమిళనాడు ప్రభుత్వం బహుముఖ వ్యూహాలను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు 2026 తమిళనాడు బడ్జెట్‌లో కీలక అంశాలను టీవీకే ప్రభుత్వం పొందుపరించింది. గత ఐదేళ్లలో రాష్ట్ర అప్పు రెట్టింపై సుమారు రూ. 10 లక్షల కోట్లకు చేరిందని శ్వేతపత్రం ద్వారా వెల్లడించిన మంత్రి మరియా విల్సన్, పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే సొంత పన్ను రాబడి, లోటు సూచికలలో రాష్ట్రం వెనుకబడి ఉందని వివరించారు. ఈ పరిమిత ఆర్థిక వనరుల మధ్యే పాలనలో పారదర్శకత, రాబడి పెంపునకు ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపట్టామన్నారు. పాలనా సంస్కరణల, టెండర్ పారదర్శకతను పెంచామన్నారు. ఏదైనా ప్రభుత్వ శాఖలో నమోదైన కాంట్రాక్టర్, అర్హత ఉంటే ఇతర శాఖల టెండర్లలో కూడా పాల్గొనేలా యథాతథ స్థితిని సవరించామన్నారు. తక్కువ విలువ కలిగిన టెండర్ల నిబంధనలను సడలించి, యువత, చిన్న వ్యాపారులు తొలిసారిగా ప్రభుత్వ కాంట్రాక్టులు పొందే అవకాశం కల్పించామని ప్రకటించారు. బహుళ అంతస్తుల నిర్మాణ ప్రణాళిక అనుమతులను ప్రభుత్వం వద్దకు రాకుండా, చైన్నె మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ స్థాయికి అధికారాలను అప్పగించి అవినీతినికి చెక్ పెడుతున్నట్టు వివరించారు.
మద్యం తయారీపై ప్రత్యేక సుంకం
మద్యం తయారీదారులపై అదనపు ప్రత్యేక సుంకాన్ని విధించడం ద్వారా సంవత్సరానికి సుమారు రూ. 1,000 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా వేశామన్నారు. జీఎస్‌టీ నాన్ – కాంటాక్ట్ అసెస్‌మెంట్, రిజిస్ట్రేషన్ శాఖలో డిజిటల్ పద్ధతిలో దస్తావేజుల నమోదు, మైనింగ్ కార్యకలాపాల పర్యవేక్షణకు పూర్తి కంప్యూటరీకరణ, చర్యల ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ. 15,000 కోట్ల అదనపు ఆదాయం సమకూరనున్నట్టు వివరించాఉరు. కేంద్ర ప్రణాళికా సంఘం మాజీ డిప్యూటీ ఛైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర పన్ను, పన్నేతర రాబడిని స్థిరమైన రీతిలో పెంచడానికి, ఆర్థిక స్వయంప్రతిపత్తిని బలోపేతం చేయడానికి ఈ కమిటీ సిఫార్సులు చేయనున్నటు తెలిపారు. ఈ చర్యల ద్వారా వృదా ఖర్చులను తగ్గించి, ప్రజా పన్ను ఽనగదు ప్రతి పైసానూ బాధ్యతాయుతంగా సంక్షేమ పథకాలకు ఉపయోగిస్తామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.
క్రీడా రంగానికి పెద్దపీట
క్రీడా రంగానికి పెద్ద పీట: బడ్జెట్‌లో దివ్యాంగుల సంక్షేమం, కార్మిక సంక్షేమం–నైపుణ్యాభివృద్ధి – క్రీడారంగానికి సంబంధించి అనేక కీలక ప్రాజెక్టులు భారీ కేటాయింపులను ప్రకటించారు.
దివ్యాంగుల సంక్షేమ శాఖ
ఈ శాఖకు కేటాయింపు రూ. 1,485 కోట్లుగా ప్రకటించారు. నంబికై ్క ఇల్లం (నమ్మకమైన గృహం) పేరిట మానసిక రుగ్మత కలిగిన పిల్లల కోసం తంజావూర్, తిరువణ్ణామలై, సేలం, కడలూరు, విరుదునగర్ త దితర 5 జిల్లాల్లో ఈ ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ 3 సంవత్సరాలు , అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ప్రత్యేక విద్య, ప్రారంభ శిక్షణ, పునరావాసం వృత్తి శిక్షణ అందిస్తారు. ప్రారంభంలో రోజువారీ పాఠశాలగా, ఆ తర్వాత వసతి గృహాలుగా వీటిని విస్తరించనున్నారు. దీని కోసం ప్రథమంగా రూ. 4 కోట్లు కేటాయించారు.
ఆధునిక ఏఐ సహాయక పరికరాలు
ఏఐ ఆధారిత స్పోర్ట్స్ ఆర్టిఫిషియల్ లెగ్స్, మైయోఎలెక్ట్రిక్ ప్రాస్థెటిక్స్, కాక్లియర్ ఇంప్లాంట్ బ్యాటరీల కొనుగోలుకు ధరలో 50% సబ్సిడీ (గరిష్టంగా రూ. 30,000 వరకు) అందిస్తారు.. కార్మిక సంక్షేమం – నైపుణ్యాభివృద్ధి శాఖకు రూ. 2,022 కోట్లు కేటాయించారు. ఎలక్ట్రిక్ వాహనాల రిపేర్ శిక్షణను 22,500 మందికి ఇవ్వడానికి రూ. 3 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ ఐటీఐలలో రూ. 10 కోట్ల వ్యయంతో ఏఐ లెర్నింగ్ కోర్సులను ప్రారంభించనున్నారు. రూ. 90 కోట్ల వ్యయంతో 5 కొత్త పారిశ్రామిక శిక్షణా సంస్థలను నెలకొల్పుతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ టూల్స్ పరిజ్ఞానాన్ని అదనంగా 2,600 పాఠశాలలకు విస్తరించనున్నారు.
యువజన సంక్షేమం – క్రీడల అభివృద్ధి
ఈ శాఖకు రూ. 1,051 కోట్లు కేటాయించారు. క్రీడాకారుల శిక్షణ కోసం రూ. 50 కోట్ల అంచనా వ్యయంతో 10 ఒలింపిక్ స్పెషల్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. 8 నుండి 18 సంవత్సరాల వయస్సు గల ప్రతిభావంతులైన పాఠశాల విద్యార్థులకు ప్రపంచ స్థాయి క్రీడా శిక్షణ ఇవ్వడానికి రూ. 5 కోట్లు కేటాయించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న 500 మంది ఉత్తమ క్రీడాకారులకు ఆర్థిక సాయం అందించేందుకు రూ. 22 కోట్లు ఇచ్చారు. తమిళుల సాంప్రదాయ క్రీడలను ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లేందుకు తమిళనాడు గ్రామీణ క్రీడల నిర్వహణకు రూ. 42 కోట్లు కేటాయించారు. అన్ని పంచాయతీ యూనియన్లు, పట్టణ స్థానిక సంస్థల సమీపంలో ఆధునిక జిమ్‌లు స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను నిర్మించనున్నారు. దీంతో పాటూ ప్రత్యేక పథకాల అమలు శాఖకు రూ. 17,150 కోట్లు కేటాయించారు.
టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినతర్వాత తొలిసారిగా తమిళనాడు అసెంబ్లీలో బుధవారం ఆర్థిక బడ్జెట్‌ను దాఖలు చేసింది. 2026–27 సంవత్సరానికి గాను రాష్ట్ర పద్దును ఆర్థిక మంత్రి మరియా విల్సన్ సభకు సమర్పించారు. ముందుకు సీఎం విజయ్ ఆశీస్సులు అందుకున్న అనంతరం అసెంబ్లీకి వచ్చిన ఆయన ఆర్థిక బడ్జెట్‌ను దాఖలు చేశారు.


