సాక్షి, చైన్నె: తమిళనాడు శాసనసభలో ఆర్థిక మంత్రి మరియా విల్సన్ ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్‌పై ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ బడ్జెట్‌కు , ప్రభుత్వ 100 రోజుల పాలనకు మార్కులు ఇస్తే పెద్ద సున్నా (బిగ్ జీరో) వస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. పథకాల పేర్ల మార్పు మాత్రమే జరిగిందని ధ్వజమెత్తారు. డీఎంకే హయంలో ప్రవేశపెట్టిన పథకాలకే కొత్త రంగులు పూసి, కేవలం పేర్లు మార్చారని విమర్శించారు. వృద్ధుల కేంద్రాలు, ల్యాప్ టాప్ పథకం, సీఎం పడిప్పగం అంటూ అన్ని పథకాలకు ముందు వెట్రి అన్న పదాన్ని చేర్చి కొత్త రంగు పూశారని మండిపడ్డారు. కలైజ్ఞర్ మగళిర్ ఉరిమై తొగై (మహిళల నెలవారీ ఆర్థిక సహాయం) మొత్తాన్ని పెంచుతామని చెప్పి, బడ్జెట్‌లో దాని గురించే ఊసేత్తలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కావేరి వ్యవహారం ప్రస్తావన కూడా లేదన్నారు. రైతులకు ఉపశమనం కల్పించే వాగ్దానం కూడా అమలుకు నోచుకోలేదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, గత 5 వారాల్లో 4 కస్టడీ మరణాలు, 5 పరువు , కుల చిచ్చు హత్యలు జరిగాయని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నలు అడిగితే ముఖ్యమంత్రి జవాబు చెప్పకుండా ఇతర మంత్రులతో సమాధానం చెప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు.


