పుదుచ్చేరిలో ముగిసిన నామినేషన్ల పర్వం | - | Sakshi
Sakshi News home page

రసవత్తరంగా పుదుచ్చేరి సమరం

Mar 24 2026 7:57 AM | Updated on Mar 24 2026 1:50 PM

-

డీఎంకే, కాంగ్రెస్‌ కూటమిలో ఉత్కంఠ

23 చోట్ల ఇరుపార్టీల నామినేషన్లు

ఎట్టకేలకు కాంగ్రెస్‌ 16, డీఎంకే 12 సీట్లతో సర్దుబాటు

సాక్షి, చైన్నె: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికల సమరం రసవత్తరంగా మారింది. ఐదు కూటములు ఈ ఎన్నికలలో అభ్యర్థులను నిలబెట్టాయి. నామినేషన్ల పర్వం సోమవారం సాయంత్రం మూడు గంటలకు ముగిసినా, డీఎంకే– కాంగ్రెస్‌ ఇండియా కూటమిలో సీట్ల లెక్క అన్నది తేల లేదు. దీంతో చివరి రోజున 23 నియోజకవర్గాలలో ఇరు పార్టీలకు చెందిన నాయకులు నామినేషన్లు వేయడంతో పరిణామాలు ఆసక్తికరంగా మార్చాయి. చివరకు సాయంత్రం ఆరు గంటల సమయంలో ఈ ఉత్కంఠకు ఇండియా కూటమిలో తెర పడింది. 

30 సీట్లతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీకి ఏప్రిల్‌ 9న ఎన్నికలు జరగనుంది. ఈ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల వద్ద ఈనెల 16 నుంచి నామినేషన్లు స్వీకరిస్తూ వచ్చారు. ఈ ఎన్నికలలో ప్రధాన సమరం ఎన్‌డీఏ, ఇండియా కూటమి మధ్య ఉంటుందని తొలుత భావించినా, తాజాగా పరిణామాలు రాజకీయాన్ని రసవత్తరం చేశాయి. ఈ రెండు కూటములను ఢీ కొట్టేందుకు ఒంటరిగా నామ్‌ తమిళర్‌ కట్చి పోటీలో ఉంది. అలాగే, విజయ్‌ టీవీకే పార్టీ నేయం మక్కల్‌ కళగంతో కలిసి పోటీలో అభ్యర్థులను పెట్టింది. ఇందులో టీవీకే 28 చోట్ల, నేయం మక్కల్‌ కట్చి రెండు చోట్ల పోటీ చేస్తోంది. 

బీజేపీలో సీట్లు దక్కని సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సాయి శరవణన్‌ కుమార్‌, ముత్యాల పేట స్వతంత్ర సిట్టింగ్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌కుమార్‌లు టీవీకే తరపున పోటీ చేస్తున్నారు. అలాగే, మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలు సైతం టీవీకే నుంచి పోటీ చేస్తుండటమే కాకుండా, ఇక్కడి ఎన్నికల వ్యవహారాలపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిభుస్సీ ఆనంద్‌ ప్రత్యేక దృష్టి పెట్టడంతో పోటీ హోరా హోరీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక, ఓట్ల చీలిక దిశగా దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ, పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు నేతృత్వంలోని కూటమి సైతం 30 చోట్ల అభ్యర్థులను నిలబెట్టడం గమనార్హం. దీంతో పుదుచ్చేరి పంచముఖ సమరం నెలకొన్నట్లయ్యింది.

చివరి క్షణం వరకు..
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సోమవారం ముగిసింది. దీంతో నియోజకవర్గాలలోని రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులుదీరారు. అన్ని పార్టీలు చివరి రోజునే నామినేషన్లు పెద్ద ఎత్తున దాఖలు చేయడంతో పూర్తి లెక్క తేలాల్సి ఉంది. చివరి రోజు రెండు వందల నామినేషన్లు దాఖలై ఉండవచ్చని అంచనా. 

అదే సమయంలో డీఎంకే, కాంగ్రెస్‌ కూటమిలో ప్రతిష్టంభన కొనసాగుతున్నది. ఆదివారం అర్థరాత్రి 12:30 గంటల నుండి సోమవారం వేకువ జామున నాలుగు గంటల వరకు సాగిన చర్చలలో కూటమి ఖారారైంది. అయితే, సీట్ల లెక్క తేలలేదు. దీంతో నేతలు అసంతృప్తితో బయటకు వెళ్లారు. ఉదయాన్నే నామినేషన్ల దాఖలుపై ఎవరికి వారు దృష్టి పెట్టారు. సిట్టింగ్‌, ముఖ్య నేతల నియోజకవర్గాలు పోగా, మిగిలిన 23 నియోజకవర్గాలలో డీఎంకే, కాంగ్రెస్‌నాయకులు ఇరువురు నామినేషన్లు వేయడం గమనార్హం. అలాగే, ప్రేమలత విజయకాంత్‌ నేతృత్వంలోని డీఎండీకే నాయకులు పలువురు సైతం నామినేషన్లు వేశారు. సీట్లు, నియోజకవర్గం లెక్క తేలినానంతరం ఉప సంహరించుకునే దిశగా నిర్ణయించారు. అదే సమయంలో నెల్లితోపు, కాలపట్టు, ముత్యాలపేట వంటి నియోజకవర్గాల కోసం ఇరు పార్టీలు పట్టుబడుతుండటం గమనార్హం. 

ఇక, మాజీ సీఎం నారాయణ స్వామి ఈ ఎన్నికలలో పోటీ చేయకుండా అధిష్టానం నిలువరించిన సమాచారంతో ఆయన మద్దతుదారులు మరో మాజీ సీఎం వైద్యలింగం నివాసాన్ని ముట్టడించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరకు సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇండియా కూటమిలో ఉత్కంఠకు తెర పడింది. సీట్లను పరస్పరం సర్దుకున్నారు. కాంగ్రెస్‌ 16 చోట్ల, డీఎంకే 12 చోట్ల, సీపీఐ ఒక చోట, వీసీకే ఒక చోట పోటీ చేయడానికి నిర్ణయించాయి. అయితే, ఈకూటమిలోని డీఎండీకే సీటు ఇవ్వలేదు. కూటమి నిర్ణయించిన స్థానాలే ఫైనల్‌ అని, కూటమి అభ్యర్థులకు వ్యతిరేకంగా నామినేషన్లు వేసిన వాళ్లంతా ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్‌, డీఎంకే అధిష్టానాలు ఆదేశాలు జారీ చేశాయి.

సజావుగా ఎన్‌డీఏ పయనం
ప్రధాన ప్రతిపక్ష డీఎంకే – కాంగ్రెస్‌ ఇండియా కూటమిలో చివరి క్షణం వరకు ఉత్కంఠ నెలకొంటే, అధికార ఎన్‌.ఆర్‌. కాంగ్రెస్‌ – బీజేపీ ఎన్‌డీఏ కూటమిలో సజావుగా సర్దుబాటు పయనం సాగింది. ఇందులో ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ 16 స్థానాలు, బీజేపీ 10 స్థానాలు, అన్నాడీఎంకే , ఎల్‌జేపీ తలా రెండు చోట్ల పోటీ చేస్తున్నాయి. ఆయా పార్టీల అధికారిక అభ్యర్థులున ఎలాంటి టెన్షన్‌ అన్నది లేకుండా సజావుగా తమ నామినేషన్లు సమర్పించేశారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో మంగళవారం పరిశీలన, గురువారం ఉపసంహరణ ప్రక్రియ చేపట్టనున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement