కోదాడ : కోదాడ సమీపంలోని ఓ మామిడి తోటలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను సోమవారం కోదాడ పట్టణ పోలీసులు పట్టుకున్నారు. కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ సమీపంలోని ఓ మామిడి తోటలో కొందరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో పట్టణ ఎస్‌ఐ అజయ్‌కుమార్ తన సిబ్బందితో కలిసి దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఐదు సెల్‌ఫోన్లు, నాలుగు బైక్‌లు, 1.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో మేళ్లచెరువుకు చెందిన కొండారి సైదులు, పసుపులేటి వెంకటేష్, చిన్నపంగు నవీన్, కోదాడకు చెందిన షేక్ ఫయాజ్‌బాబ, షేక్ రేహాన్, కొండ నిఖిల్, షేక్ వాజిద్ ఉన్నారు. మరో ముగ్గురు పరారైనట్లు డీఎస్పీ తెలిపారు. వీరు ఆంధ్ర, ఒడిస్సా బార్డర్ నుంచి గంజాయి తీసుకొచ్చి కోదాడ, మేళ్లచెరువు పరిసర ప్రాంతాలలో విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సీఐ శివశంకర్, ఎస్‌ఐ అజయ్‌కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


