● కొడుకు తీరుతో విసుగుచెంది
రోకలిబండతో కొట్టి హత్య
చందంపేట : మద్యం మత్తులో తల్లిదండ్రులపై దాడికి పాల్పడిన కుమారుడిని తండ్రి రోకలిబండతో కొట్టి హతమార్చాడు. ఈ ఘటన చందంపేట మండలం బుడ్డోనితండా గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటినాయక్‌తండాలో సోమవారం జరిగింది. తండావాసులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటినాయక్‌తండాకు చెందిన నేనావత్ లష్కర్, కంసాలి దంపతులతో పాటు వారి పెద్ద కుమారుడు మకట్‌లాల్(31) బతుకుదెరువు నిమిత్తం రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌కు వలస వెళ్లి జీవనం సాగిస్తున్నారు. గతంలో చాలాసార్లు మకట్‌లాల్ మద్యం మత్తులో తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డాడు. తీజ్ పండుగ కోసం ముగ్గురు కలిసి శుక్రవారం స్వగ్రామానికి వచ్చారు. ఈ క్రమంలోనే సోమవారం తెల్లవారుజామున మకట్‌లాల్ మద్యం మత్తులో తల్లిపై దాడి చేస్తుండగా.. పక్కనే ఉన్న తండ్రి లష్కర్ అతడిని వారించాడు. దీంతో మకట్‌లాల్ తండ్రిపై కూడా దాడి చేశాడు. క్షణికావేశంలో నేనావత్ లష్కర్ తన కుమారుడి తలపై రోకలిబండతో కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న డిండి సీఐ బీసన్న ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లోకేష్ తెలిపారు. మృతుడు అవివాహితుడు.


