సూర్యాపేట : పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా విద్యార్థులకు ప్రభుత్వం ఇంకా ఉచిత యూనిఫాం అందించలేదు. దీంతో వేలాది మంది విద్యార్థులు రోజూ సివిల్ డ్రెస్సులతోనే పాఠశాలలకు హాజరవుతున్నారు. ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలోనే యూనిఫాం అందించాల్సి ఉన్నా, ఈసారి యూనిఫాం కలర్ మార్చడంతో పాటు వస్త్రాల సరఫరా ఆలస్యమైంది. దీంతో యూనిఫాం కుట్టే ప్రక్రియ నత్తనడకన సాగుతున్నట్టు తెలుస్తోంది. అయితే స్వాతంత్య్ర దినోత్సవం నాటికి యూనిఫాం అందిస్తామని అధికారులు చెబుతున్నా.. అప్పటిలోగా అందుతుందో లేదో అనుమానంగానే ఉంది. యూనిఫాం అందకపోవడంతో విద్యార్థులు సివిల్ డ్రెస్సుల్లోనే పాఠశాలలకు వెళ్తున్నారు.
పూర్తిస్థాయిలో అందని వస్త్రం
జిల్లాలో 950 పాఠశాలలు ఉండగా వీటిల్లో 23,547 మంది బాలురు, 19,985 మంది బాలికలతో మొత్తం 43,472 మంది విద్యనభ్యసిస్తున్నారు. ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫాం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా వస్త్రాల పంపిణీ చేపట్టాల్సి ఉన్నా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో వస్త్రం అందలేదు.
వచ్చింది చొక్కా క్లాత్ మాత్రమే..
యూనిఫాం తయారీ కోసం అవసరమైన చొక్కా క్లాత్ మాత్రమే జిల్లాకు చేరింది. అయితే ప్యాంటు, స్కర్ట్‌ల కోసం బాటమ్ క్లాత్ ఇంకా రాలేదు. ప్రస్తుతం అధికారులు షర్టింగ్ క్లాత్‌ను గతంలో మాదిరిగానే ఈసారి కూడా యూనిఫాం కుట్టే బాధ్యతలను మండలాల మహిళా సంఘాలకు అప్పగించారు. వస్త్రాలు పూర్తిగా అందిన వెంటనే కొలతలు తీసి కుట్టించాలని సూచించినా, అవసరమైన క్లాత్ అందకపోవడంతో కుట్టుపని ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
రెండు జతలు పంపిణీ చేస్తాం
విద్యార్థులకు ఈ ఏడాది యూనిఫాం కలర్ మారడంతో వస్త్రం రాక ఆలస్యమైంది. ఇప్పటి వరు అవసరమైన చొక్కా క్లాత్ జిల్లాకు చేరింది. బాటమ్ క్లాత్ కూడా రెండు మూడు రోజుల్లో వస్తుంది. మహిళా సంఘాలు కుట్టు పని ప్రారంభించాయి. ఆగస్టు 15వ తేదీలోపు రెండు జతల యూనిఫాం అందిస్తాం.
– అశోక్, జిల్లా విద్యా శాఖ అధికారి
పంద్రాగస్టుకు యూనిఫాం ఇస్తామంటున్న విద్యా శాఖ
కొనసాగుతున్నది చొక్కా కుట్టుపనే..
ఇంకా పూర్తిస్థాయిలో
సరఫరా కాని వస్త్రం
ఎదురుచూపుల్లో విద్యార్థులు


