అన్ని జిల్లా
కేంద్రాలకు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మూడు జిల్లా కేంద్రాలకు రైల్వే కనెక్టివిటీ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటివరకు నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల కేంద్రాలకు రైల్వే కనెక్టివిటీ ఉండగా, సూర్యాపేట జిల్లా కేంద్రానికి కూడా రైల్వే కల నెరవేరబోతోంది. అందుకు అవసరమైన పనులకు 2026–27 రైల్వే బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌కు సంబంధించిన సమగ్ర కేటాయింపుల వివరాలతో కూడిన నివేదికను ఇటీవల కేంద్రం దక్షిణ మధ్య రైల్వేకు అందించింది. అందులో ఉమ్మడి నల్లగొండ జిల్లా మీదుగా చేపట్టే రైల్వే లైన్ల సర్వేలు, కొత్త లైన్లకు సంబంధించిన అంశాలను పేర్కొంది. వాటికి కొంత మేర నిధులు కేటాయించింది. ఆ ప్రాజెక్టులు ఆచరణ రూపం దాల్చితే సూర్యాపేటతో పాటు దేవరకొండ వంటి ప్రాంతాలకు కూడా రైల్వే కనెక్టివిటీ లభించనుంది.
కీలక ప్రాజెక్టులకు నిధులు
సూర్యాపేటను కలుపుతూ చేపట్టే విశాఖపట్టణం – విజయవాడ – శంషాబాద్ లైన్‌తో పాటు నల్లగొండ, దేవరకొండను కలుపుతూ చేపట్టే విశాఖపట్టణం – విజయవాడ – కర్నూల్‌కు సెమీహైస్పీడ్/హైస్పీడ్ రైల్వే కారిడార్ ఫైనల్ లొకేషన్ సర్వేకు ఈసారి బడ్జెట్‌లో రూ.4.71 కోట్లు కేటాయించింది. ఇది పూర్తయ్యాక డీటేయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టును రూపొందించనుంది.
శంషాబాద్ – విశాఖపట్టణం లైన్ శంషాబాద్ నుంచి గట్టుప్పల్ మీదుగా చిట్యాల, నకిరేకల్, సూర్యాపేట మీదుగా జగ్గయ్యపేట, విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, తుని నుంచి విశాఖపట్టణం చేరనుంది.
ఇక మరోలైన్ విశాఖపట్టణం నుంచి విజయవాడ, జగ్గయ్యపేట మీదుగా సూర్యాపేట, నల్లగొండ, దేవరకొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల మీదుగా కర్నూల్‌కు ఏర్పాటు చేయనున్నారు. 942 కిలోమీటర్ల పొడవు కలిగిన ఈ రూట్‌లో సెమీ హైస్పీడ్ / హైస్పీడ్ రైల్ గంటకు 220 కిలోమీటర్ల వేగంగంతో ప్రయాణించనుంది. అంటే నాలుగు గంటల్లో శంషాబాద్ నుంచి విశాఖపట్టణం చేరనుంది.
దాదాపు 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మాచర్ల – నల్లగొండకు 92 కిలోమీటర్ల పొడవునా కొత్త రైల్వే లైన్ వేసేందుకు రూ.458.46 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొంది.
133 కిలోమీటర్లు ఉన్న డోర్నకల్ –మిర్యాలగూడ లైన్ అంశాన్ని బడ్జెట్‌లో ప్రస్తావించింది. ఈ లైన్ నిఘా, ట్రాఫిక్ సర్వే కోసం బడ్జెట్‌లో రూ.37 లక్షలు కేటాయించింది. దీంతో పాటు ఉమ్మడి జిల్లాలో అదనపు బాక్స్ బ్రిడ్జీలు, నల్లగొండ, మిర్యాలగూడ స్టేషన్లలో వికలాంగుల కోసం సదుపాయాల కల్పన, ప్లాట్‌ఫామ్‌ల విస్తరణ, ఎస్కలేటర్లకు నిధులను కేటాయించింది.
ఎఫ్‌ఎల్‌ఎస్ పూర్తయిన డోర్నకల్ – గద్వాల లైన్
డోర్నకల్ – గద్వాల రైల్వే లైన్ ఫైనల్ లొకేషన్ సర్వేను (ఎఫ్‌ఎల్‌ఎస్) కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది. 2023 చేపట్టిన ఎఫ్‌ఎల్‌ఎస్ మార్చి నెలలో పూర్తయిందని, ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని ప్రకటించారు. 296 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ లైన్‌కు సంబంధించిన డీటేయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) కూడా చివరి దశకు చేరుకుంది. ఒకటీ రెండు నెలల్లో ఆ నివేదిక రైల్వే బోర్డుకు చేరనుంది. రూ.5,330 కోట్ల అంచనాలతో చేపట్టే ఈ లైన్ నిర్మాణం ఆచరణలోకి వస్తే డోర్నకల్ నుంచి కూసుమంచి మీదుగా పాలేరు, మోతే, సూర్యాపేట, నల్లగొండ, దేవరకొండ లేదా నాంపల్లి, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, వనపర్తి మీదుగా గద్వాలకు చేరనుంది. వీటిల్లో ఈ రైల్వే లైన్ ఆచరణ రూపం దాల్చినా జిల్లాలో ఇంతవరకు రైల్వే కనెకట్టివిటీ లేని ప్రాంతాలకు రైల్వే సదుపాయం లభించనుంది.
ఫ ఇప్పటికే నల్లగొండ, భువనగిరికి రైల్వే కనెక్టివిటీ
ఫ ఇక సూర్యాపేటకూ రైలు సౌకర్యం
ఫ కొత్త రూట్లలోనూ రైల్వే లైన్లు
ఫ డోర్నకల్ – గద్వాల ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తి
ఫ మాచర్ల – నల్లగొండ లైన్‌కు రూ.458.46 కోట్లు కేటాయింపు
ఫ డోర్నకల్–మిర్యాలగూడ అంశాన్ని పేర్కొన్న రైల్వే శాఖ
ఫ 2026–27 బడ్జెట్ వివరాలు వెల్లడించిన దక్షిణ మధ్య రైల్వే


