చిలుకూరు : కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై చిలుకూరు మండల కేంద్రంలో బస్ షెల్టర్ ఏర్పాటు చేయలేదు. వివిధ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు గ్రామంలోని సెంటర్‌కు వచ్చి బస్సుల కోసం వేచి చూస్తుంటారు. బస్‌షెల్టర్ లేక ఎండలోనే నిలబడాల్సి వస్తున్నది. వర్షం పడితే దుకాణాల వద్దకు పరుగులు తీయాల్సిన పరిస్థితి. హైవే అథారిటీ వారు సీతారాంపురం, కవిత జూనియర్‌కళాశాల వద్ద బస్‌షెల్టర్లు ఏర్పాటు చేశారు కానీ మండల కేంద్రంలో మాత్రం ఏర్పాటు చేయలేదు. వృద్ధులు, మహిళలు ఎండలోనే గంటల కొద్దీ నిలబడాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు క్రాస్ రోడ్డు వద్ద బస్సుల కోసం ఎదురు చూస్తుంటారు. వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులు కూడా ఇక్కడే నిలిపి ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్తుంటాయి. ఈ ప్రాంతంలో బస్‌షెల్టర్ లేక పోవడంతో అవస్థలు పడుతున్నారు. సూర్యాపేట–జనగామ, తొర్రూరు–మోత్కూరు వెళ్లే రూట్లోనూ బస్ షల్టర్లు లేక పోవడంతో రోడ్డు పైనే నిరీక్షించాల్సి వస్తున్నది. ఎండ వేడిమి తట్టుకోలేక పక్కనే ఉన్న దుకాణాల ముందు నిలబడితే షాపుల యజమానులు వెళ్లగొడుతున్నారని ప్రయాణికులు వాపోతున్నారు.


