కంచిలి: మండలంలోని ఎస్‌ఆర్‌సీపురం గ్రామ మెయిన్ రోడ్డులో నివసిస్తున్న గుడియా జ్ఞాని(58) అనే వ్యక్తి అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. మృతునికి సంతానం లేదు. దీంతో అతని భార్య భాగ్యవతి భర్త మృతదేహానికి తలకొరివి పెట్టింది. మృతుని స్వగ్రామం పద్మతుల కావడంతో ఆ గ్రామ శ్మశానవాటికలోనే అంత్యక్రియలు జరిపించారు.
గండెపోటుతో జవాన్ మృతి
ఆమదాలవలస: హిమాచల్ ప్రదేశ్‌లోని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌లో 22 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఎంవీఎస్‌ఎన్ గిరి (52) బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. దీంతో ఆయన స్వగ్రామం మున్సిపాలిటీ పరిధి ఒకటో వార్డు తిమ్మాపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. గిరికి భార్య హేమలతతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహం స్వగ్రామానికి గురువారం రానుంది.
74 మద్యం బాటిళ్లు స్వాధీనం
వజ్రపుకొత్తూరు రూరల్: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి బెండి గ్రామానికి చెందిన విశ్రాంత ఆర్మీ జవాన్ డొంకాన హేమంత్ వద్ద ఉన్న 74 డిఫెన్స్ మద్యం బాటిళ్లను మంగళవారం రాత్రి ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ముద్దాయిని బుధవారం కోర్టులో హాజరుపరిచారు. అనంతరం పాతపట్నం సబ్ జైల్‌కు తరలించినట్లు ఎకై ్సజ్ శాఖ సీఐ మల్లిఖర్జునరావు తెలిపారు. అనాధికారికంగా మద్యం అమ్మకాలు చేపడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
గుర్తు తెలియని వ్యక్తి
మృతదేహం లభ్యం
ఇచ్ఛాపురం: మున్సిపాలిటీ పరిధి పురుషోత్తపురం గ్రామ జాతీయ రహదారి–16 సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు బుధవారం గుర్తించారు. ఈ మేరకు గ్రామస్తులు పట్టణ పోలీసులకు సమాచారం అందజేశారు. వీఆర్వో నర్తు కృష్ణారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్‌ఐ ఎం.ముకుందరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వయసు సుమారు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.
ప్రభుత్వ కళాశాలల్లో
ప్రమాణాలతో కూడిన విద్య
● ఇంటర్ విద్య డీవీఈవో సురేష్‌కుమార్
శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు విలువలు, ప్రమాణాలతో కూడిన విద్యనందించడం జరుగుతుందని ఇంటర్మీడియట్ విద్య జిల్లా డీవీఈవో/ఆర్‌ఐవో రేగ సురేష్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన జిల్లాలోని కొయ్యాం, ఎచ్చెర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలను తనిఖీ చేశారు. విద్యార్థులు, అధ్యాపకుల హాజరు, అటెండెన్స్ పుస్తకాలను పరిశీలించారు. అకడమిక్‌కు సంబంధించిన పలు రికార్డులు, ప్రగతి, అధ్యాపకుల పనితీరు, లెస్సన్ ప్లాన్స్, టీచింగ్ డెయిరీను పరిశీలించారు. అధ్యాపకులతో మాట్లాడుతూ అకడమిక్ ఆర్గనైజర్ ప్రకారం బోధన జరగాలని, విద్యార్థుల శతశాతం హాజరుకావాలని, గైర్హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతుండాలని సూచించారు. సకాలంలో సిలబస్ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటినుంచే సైన్స్ విద్యార్థులకు వారంతపు పరీక్షలు, ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తుండాలన్నారు. కళాశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న వసతులు, సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనతో పాటు ప్రిన్సిపాల్స్ కీర్తి తవిటినాయుడు, శైలజ తదితరులు పాల్గొన్నారు.


