ప్రాణభిక్ష పెట్టండయ్యా..! | - | Sakshi
Sakshi News home page

ప్రాణభిక్ష పెట్టండయ్యా..!

Aug 13 2026 12:45 AM | Updated on Aug 13 2026 12:45 AM

కాలేయ వ్యాధితో బాధపడుతున్న జర్నలిస్టు శ్రీనివాసరావు

చికిత్స కోసం దాతలు ముందుకు రావాలని వేడుకోలు

శ్రీకాకుళం: ప్రజా సమస్యలపై కలం పట్టి నిత్యం వార్తలు రాసే ఆ చేయి.. సాయం కోసం ఎదురుచూస్తోంది. సమాజంలో ఎంతోమంది బాధితుల సమస్యలను అధికారుల దృష్టికి వ్యక్తి.. ఇప్పుడు తన జీవితాన్నే నిలబెట్టుకోవడానికి పోరాడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం నగరానికి సుపరిచితుడైన సీనియర్‌ జర్నలిస్ట్‌ పైల శ్రీనివాసరావు తీవ్ర కాలేయ వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆయన 2004లో జర్నలిస్టుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అయితే గత రెండేళ్లుగా తీవ్రమైన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి విషమించడంతో మంచానికే పరిమితమయ్యారు.

వైద్యానికి డబ్బులు లేక...

శ్రీనివాసరావును పరిశీలించిన వైద్యులు కాలేయం పూర్తిగా దెబ్బతిందని, తక్షణమే ‘కాలేయ మార్పిడి’ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదమని స్పష్టం చేశారు. దీంతో భర్తను కాపాడుకునేందుకు ఆయన భార్య తన కాలేయంలో కొంత భాగాన్ని ఇచ్చేందుకు ధైర్యంగా ముందుకొచ్చారు. అయితే శస్త్రచికిత్స, ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం సుమారు రూ.30 లక్షలు అవసరమవుతాయని వైద్యులు తెలిపారు. కేవలం 38 ఏళ్ల చిన్న వయసులోనే శ్రీనివాసరావు ఈ స్థితికి చేరుకోవడం, ఆదాయ మార్గాలు పూర్తిగా మూసుకుపోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. శ్రీకాకుళం నగరంలోని చిన బొందిలీపురం సాయిబాబా కాలనీ వద్ద ఒక అద్దె ఇంట్లో నివాసముంటున్న ఈ కుటుంబం, రోజువారీ మందుల ఖర్చుల కోసమే వేలకు వేలు వెచ్చించాల్సి వస్తోంది. శ్రీనివాసరావుకు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కు మంచాన పడడంతో ఆ ఇల్లు కన్నీటి సంద్రమైంది. దాతలు స్పందించి తన భర్తకు ప్రాణబిక్ష పెట్టాలని శ్రీనివాసరావు భార్య ధనలక్ష్మి కోరుతున్నారు. దాతలు 73307 00496 నంబర్‌ను సంప్రదించాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement