శ్రీకాకుళం అర్బన్: బ్యాంక్ ఉద్యోగులకు తక్షణమే 12వ వేతన సవరణ చేపట్టాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ జిల్లా కన్వీనర్ బి.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో యూనియన్ జిల్లా కన్వీనర్ బి.శ్రీనివాసులు అధ్యక్షతన బుధవారం శ్రీకాకుళంలోని జీటీరోడ్‌లో ఉన్న డిస్ట్రిక్ట్ కో–ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ వద్ద అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకు ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులకు 5 రోజుల పనిదినాలు అమలు చేయాలని ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్‌ను అడగగా, వేతన సవరణతో కాకుండా విడిగా 5 రోజుల పనిదినాలను గురించి చర్చించుకుందామని చెప్పడం జరిగిందన్నారు. యూఎఫ్‌బీఏ, ఐబీఏకు జరిగిన చర్చల్లో 5 రోజుల పనిదినాలకు ఒప్పుకుంటూ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిందన్నారు. అయితే ప్రభుత్వం స్పందించకపోవడంతో జనవరిలో సమ్మె చేయడం జరిగిందని, నేటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఆఫీసర్స్ సంఘ నాయకుడు రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే 5 రోజుల పనిదినాలను అమలు చేయాలన్నారు. లేకుంటే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీసీసీబీఈఏ నాయకులు సీతారాం, మురళి, కామరాజు, దశరథరామ్, సంధ్య, లావణ్య, ఇండియన్ బ్యాంక్ ప్రతినిధులు రమేష్, శ్రావణి, ఏపీ అండ్ టీబీఈఎఫ్ సహాయ మహిళా కన్వీనర్ జి.కరుణ, జిల్లా బ్యాంక్ ఎంప్లాయీస్ కో–ఆర్డినేషన్ కమిటీ ప్రతినిధులు గిరిప్రసాద్, సూర్య, ఉపేంద్ర, ఆఫీసర్స్ సంఘ సభ్యులు సూర్యకిరణ్, శ్రీనివాస్, నరేష్, డీసీసీబీ ఆఫీసర్స్ సంఘ ప్రతినిధి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.


