● ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర
ఉపాధ్యక్షుడు వాబ యోగి మండిపాటు
సారవకోట: కూటమి ప్రభుత్వం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల్లో కమోటి, కుక్ పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న గిరిజనుల పొట్ట కొడుతోందని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి ఆరోపించారు. మండల కేంద్రంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 32 మంది గిరిజనులు ఆశ్రమ పాఠశాలల్లో కమోటి, కుక్ పోస్టుల్లో గత 10 – 15 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్నారన్నారు. వారిని తొలగించి వారి స్థానంలో అవుట్ సోర్సింగ్ విధానంలో థర్డ్ పార్టీ అయిన హైదరాబాద్‌కు చెందిన పద్దాయిమి ఐటీ సొల్యుషన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఆ పోస్టులు భర్తీ చేస్తోందని ఆరోపించారు. దీనివలన 32 మంది గిరిజనులు రోడ్డున పడుతున్నారన్నారు. దీంతో వీరికి అప్కాస్‌లో చేర్చి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ కోర్టులో కేసు వేశామని, దీనిపై కోర్టు ఇన్‌టీరియం ఆర్డర్ ఇవ్వగా ఈ ఏడాది మార్చి 16న జిల్లా కలెక్టర్‌కు కోర్టు అర్డర్‌తో కూడిన వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. 2024లో రాష్ట్రంలోని ఆశ్రమ పాఠశాలల్లో 347 కుక్, కమోటి పోస్టులుండగా.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పద్దాయిమి ఐటీ సొల్యుషన్ ప్రెవేట్ లిమిటెడ్ ద్వారా 463 పోస్టులు భర్తీ చేస్తోందన్నారు. అయితే పాఠశాలల్లో విద్యార్థులు లేరని రేషలైనజేషన్ విధానంతో పలు ఆశ్రమ పాఠశాలలో ఎత్తివేసే ప్రక్రియ ప్రారంభించి, ఇప్పుడు పోస్టులను ఏవిధంగా పెంచారని ప్రశ్నించారు. ఒక ప్రైవేట్ సంస్థకు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అప్పగించడం వలన ఆ సంస్థకు లాభం చేకూర్చితే వారిచ్చే వాటాలు ఎవరికి చేరుతాయని మండిపడ్డారు. ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న వారిని రోడ్డున పడేస్తున్న కూటమి ప్రభుత్వంపై జిల్లాలోని గిరిజనులంతా న్యాయ పోరాటం చేస్తామని, దీనిపై ఉద్యమ కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు.


