కొత్తూరు: బంధువుల ఇంట్లో పెద్దకర్మకు వెళ్లి వస్తూ ఒక వ్యక్తి మృత్యువాతపడిన ఘటన మండలంలోని గులుమూరు – నివగాం రోడ్డులో మదనాపురం గ్రామం సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొత్తూరు మండలం నివగాం గ్రామానికి చెందిన వాడ రామారావు (52) జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలోని బంధువుల ఇంట్లో జరుగుతున్న పెద్దకర్మ కార్యక్రమానికి వరుసకు అన్నయ్య కొడుకు అయినటువంటి సంతోష్ కుమార్‌తో కలిసి ద్విచక్ర వాహనం మీద బయల్దేరాడు. మార్గమధ్యలో మదనాపురం – సోమరాజపురం గ్రామాల మధ్య మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ రామారావు డ్రైవింగ్ చేస్తున్న బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రామారావు సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. వెనుక కూర్చున్న సంతోష్ కుమార్ చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. సంతోష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఏఎస్‌ఐ రాజేశ్వరరావు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పాతపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని సీఐ చింతాడ ప్రసాద్ పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. మృతుడికి భార్య మంగమ్మ, కుమారులు గౌరీశంకర్, భానుప్రసాద్‌లు ఉన్నారు. మృతుడు రామారావు చెరువుల్లో చేపల వేట చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రామారావు మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.


