108కు కలవడం లేదు
టెక్కలి రూరల్:
ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నవారికి ఒక్క నిమిషం ఆలస్యం కూడా ప్రాణాంతకం అయ్యే ప్రమాదం ఉంటుంది. అందువలన ఆపదలో ఉన్న వ్యక్తిని వేగవంతంగా ఆస్పత్రికి చేర్చాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 108 అంబులెన్స్‌లను తీసుకొచ్చారు. అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వీటికి కాల్ చేస్తే వెంటనే వచ్చి రోగిని ఆస్పత్రికి చేర్చుతాయి. అయితే ప్రస్తు తం నిమిషాల వ్యవధిలో చేరుకోవాల్సిన అంబులెన్స్‌ల జాడ లేకపోవడంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయి. 108 సేవల్లో అలసత్వం కారణంగా రోడ్డు ప్రమాదాల క్షతగాత్రుల నుంచి అనారోగ్య బాధితు లు, నిండు గర్భిణులు దాకా బలైపోతున్నారు.
●గత నెల 18వ తేదీన నందిగాం మండలం కొత్త అగ్రహరం గ్రామానికి చెందిన ఒక వృద్ధుడు 108 సమయానికి రాకపోవడంతో మృతి చెందిన విష యం తెలిసిందే. అలాగే టెక్కలి జిల్లా ఆస్పత్రిలో నిత్యం 108 అంబులెన్స్‌లు అందుబాటులో లేక చాలా కేసులు ప్రైవేట్ వాహనాల్లో జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. టెక్కలి జిల్లా ఆస్పత్రికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలా కేసులు రిఫర్ మీద వస్తాయి. అలాగే ఇక్కడ నుంచి కొన్ని కేసులు రిఫర్ చేస్తూనే ఉంటారు. అయితే టెక్కలి జిల్లా ఆస్పత్రి నుంచి జిల్లా కేంద్రం శ్రీకాకు ళంకు ఒక కేసు రిఫర్‌పై వెళ్లిన తర్వాత.. మరో కేసు రిఫర్ చేయాలంటే 108 అందుబాటులోకి రావడం లేదు. దీంతో చాలా సమయం రోగి 108 కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. కొన్నిసార్లు 108 అందుబాటులో లేదంటు కాల్ సెంటర్ వాళ్లు చెబుతు న్నారని రోగుల బంధువులు వాపోతున్నారు.
●ఇటీవల టెక్కలి జిల్లా ఆస్పత్రికి బారువ నుంచి గురమ్మ అనే రోగి రిఫర్‌పై వచ్చింది. అయితే అమె పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం రిఫర్ చేశారు. దీంతో వాళ్ల కుటుంబ సభ్యుడు రాజేష్ అనే వ్యక్తి 108కి ఫోన్ చేయగా రావడానికి సమయం పడుతుందని చెప్పినట్లు తెలిపారు. అలాగే హారికవలస గ్రామానికి చెందిన మాధవయ్య అనే వ్యక్తికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ నుంచి ఆ వ్యక్తిని శ్రీకాకుళం రిఫర్ చేయగా.. ఆయన కుమారు డు బొకరా శ్రీనివాసరావు పలుమార్లు 108కు ఫోన్ చేసినప్పటికీ అందుబాటులో లేదని చెబుతున్నారని వాపోయారు. ఇలా ప్రభుత్వ ఆస్పత్రి నుంచి జిల్లా కేంద్రం శ్రీకాకుళంలోని ఆస్పత్రులకు తీసుకెళ్లేందు కు 108 వాహనాలు అందుబాటులో లేకపోవడంతో చాలామంది రోగులు అవస్థలు పడుతున్నారు. దీంతో చివరకు ప్రైవేట్ అంబులెన్స్‌లే దిక్కవుతున్నా యని వాపోతున్నారు. వారు సైతం అధిక రేట్లు డిమాండ్ చేస్తున్నారని చెబుతున్నారు. ఈ సమస్యలపై అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.
మా నాన్న బి.మాధవయ్యకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చాము. అయితే ఇక్కడ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. దీంతో 108కు కాల్ చేయగా వాహనం అందుబాటులో లేదని చెప్పారు. దీనివలన చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము.
– బోరక శ్రీనివాసరావు, రోగి కుమారుడు


