● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ● పీజీఆర్‌ఎస్‌లో 169 అర్జీలు స్వీకరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీలు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేది కలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి అర్జీలను సోమవారం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీలు పెండింగ్‌లో లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తం 169 ఆన్‌లైన్ అర్జీలు స్వీకరించగా.. ఇందులో రెవెన్యూ 98, పంచాయతీ రాజ్ 27, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ 12, ఏపీఈపీడీసీఎల్ 5, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ 4, స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డ్ 3, వ్యవసాయ శాఖ, స్కూల్ ఎడ్యుకేషన్, గ్రామీణాభివృద్ధి, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్, మున్సిపల్ పరిపాలన, హోం శాఖలు నుంచి రెండేసి చొప్పున, వాటర్ రిసోర్సెస్ ఈఎన్సీ, చేనేత కార్మిక శాఖ, మెడికల్ ఎడ్యుకేషన్, మైన్స్ అండ్ జియాలజీ, పౌర సరఫరాలు, మత్స్యశాఖ, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ తదితర శాఖలు నుంచి ఒక్కొక్కటి చొప్పున వినతులు స్వీకరించారు. అర్జీల స్వీకరణలో అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్య, డిప్యూటీ కలెక్టర్ జి.జయదేవి, డీఆర్డీఎ పీడీ కిరణ్ కుమార్ ఉన్నారు.
తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి
శ్రీకాకుళం రిమ్స్ (ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి)లో అన్యాయంగా తొలగించిన దళిత పారిశుద్ధ్య కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని దళిత ప్రజా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందజేశారు. చట్టబద్ధంగా రావాల్సిన కనీస వేతనాలు అడిగినందుకే కక్షగట్టి దళిత కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించారని తెలిపా రు. తొలగించిన 23 మంది కార్మికులను ఆదివారం లోపు తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, సమస్యను పరిష్కరించకపోతే రిమ్స్ ప్రధాన గేట్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కలెక్టర్‌ను కలిసినవారిలో ఉపాధ్యాయ, విద్యార్థి, దళిత ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ పేడాడ కృష్ణారావు, వివిధ ప్రజా సంఘాల నాయకులు డి.గణేష్, యడ్ల గోపి, భాస్కరరావు, లోపింటి తేజేశ్వరరావు, దీర్ఘాశి హరీష్, రాకోటి రాంబాబు, బైరి ధనరాజ్, చీర రాజేశ్వరి, దమ్ము చిన్నారావు, కొప్పల కృష్ణకుమారి, కొప్పల నీలవేణి, చింతల పోలమ్మ, స్యలాడ పద్మ, మండల భూదేవి, దమ్ము అన్నపూర్ణ, దమ్ము పద్మ, దమ్ము దుర్గ తదితరులు ఉన్నారు.
నిర్మాణాలు నిలుపుదల చేయాలి
హిరమండలం ఆర్‌ఆర్ కాలనీ మూడు రోడ్ల జంక్షన్ వద్ద కేంద్ర జల సంఘం కార్యాలయం ముందు ప్ర భుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని కమర్షియల్ షాపుల ను నిర్మిస్తున్నారని, వాటిని నిలుపుదల చేయాలని మెట్టూరు బిట్–2కి చెందిన పి.కల్యాణ్ ఫిర్యాదు చేశారు.
రూ.50 వేలు చెల్లిస్తేనే టీసీ ఇస్తామని అరసవల్లి అమ్మవారి గుడి సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ స్కూ ల్ యాజమాన్యం చెబుతోందని రూరల్ మండలంలోని సానివాడ గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి దశముఖ పవన్ కుమార్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. ఆ పాఠశాలలో ఉపాధ్యాయులు లేనందున స్కూల్‌ను మూసేశారని వివరించారు. ప్రస్తుతం టీసీ కోసం దరఖాస్తు చేయగా రూ.50 వేలు డిమాండ్ చేసినట్టు విద్యార్థి తండ్రి రమేష్ తెలిపారు. ఈ విషయాన్ని మండల విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్తే యాజమాన్యానికి వత్తాసు పలికినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు టీసీ ఇప్పించి న్యాయం చేయాలని కోరారు.


