క్రీడలను ప్రోత్సహించాలి
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
● నేటి నుంచి జిల్లా అథ్లెటిక్స్ పోరు ● కేఆర్ స్టేడియం వేదికగా కొన్న చిన్నారావు మెమోరియల్ పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: దివంగత కొన్న చిన్నారావు మెమోరియల్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలకు సర్వం సిద్ధమైంది. గత 18 ఏళ్లుగా కొన్న చిన్నారావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న స్పోర్ట్స్‌మీట్‌ను ఆదివారం నుంచి ప్రారంభించనున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అండర్–14, 16, 18, 20 విభాగాల్లో బాలబాలికలకు పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 400 నుంచి 500 మంది వరకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
సిద్ధమైన కేఆర్ స్టేడియం
ఇదిలా ఉండగా పోటీలకు ఆతిథ్యమిస్తున్న శ్రీకాకుళంలోని కోడిరామ్మూర్తి స్టేడియంను సుందంగా తీర్చిదిద్దారు. మైదానంలో రన్నింగ్ ట్రాక్, ఇతర ఈవెంట్స్ కోర్టులకు తుది మెరుగులు దిద్దారు. చిన్నారావు కుటుంబ సభ్యులు కొన్న వెంకటేశ్వరరావు(వాసు), కొన్న మధుసూదనరావు, ప్రగాడ అశోక్‌కుమార్, పూడి బాలాదిత్య ఆధ్వర్యంలో నౌపడ విజయ్‌కుమార్, మెంటాడ సాంబమూర్తి, మాధవరావు, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. విజేతలకు పతకాలు, ప్రశంసాపత్రాలను అందజేయనున్నారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు 2006 సెప్టెంబర్ 18 నుంచి 2014 సెప్టెంబర్ 17వ తేదీ మధ్య జన్మించి ఉండాలని అథ్లెటిక్స్ సంఘ ప్రతినిధులు సూచిస్తున్నారు.
మా తల్లిదండ్రులే మా ఆస్తి. మా నాన్నగారు కొన్న చిన్నారావు మెమోరియల్ పేరిట ప్రతిఏటా స్పోర్ట్స్‌మీట్‌ను మా కుటుంబ సభ్యులు, మిత్రబృందం, అథ్లెటిక్స్ సంఘ ప్రతినిధులంతా కలిసి సమష్టిగా నిర్వహిస్తున్నాం. క్రీడాకారులను ప్రభుత్వాలతో పాటు ప్రోత్సాహకులు కూడా ప్రోత్సహించిననాడే వారిలో ఉన్న టాలెంట్ బయటపడుతుంది.
– కొన్న వెంకటేశ్వరరావు(వాసు),
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్
గత 18 ఏళ్లుగా స్పోర్ట్స్ మీట్‌లను నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న చిన్నారావు కుటుంబ సభ్యులు ఆదర్శంగా నిలుస్తారు. ఈ పోటీల్లో అథ్లెటిక్స్ సంఘం తరుపున నేనూ భాగస్వామ్యం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. మీట్ కమ్ సెలక్షన్స్‌లో విజేతలగా నిలిచిన ప్లేయర్స్‌ను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తాం.
– మెంటాడ సాంబమూర్తి,
ఒలింపిక్ అసోసియేషన్, అథ్లెటిక్స్ అసోసియేషన్
జిల్లా ప్రధాన కార్యదర్శి


