వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ
సమన్వయకర్త పేరాడ తిలక్
టెక్కలి: జిల్లాలోని వైఎస్సార్‌సీపీ నాయకులపై ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేసే కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ మండిపడ్డారు. టెక్కలిలో శనివారం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన జిల్లా పర్యటనకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో, కూటమి నాయకులు తట్టుకోలేకపోతున్నారన్నారు. ఎలాగైనా వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసులు నమోదు చేయాలని మహిళా ఎస్‌ఐ ప్రవళ్లికను పావుగా వినియోగించుకొని, పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌పై అక్రమంగా కేసులు నమోదు చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్‌ఐ ప్రవళ్లిక విధులు నిర్వహించే క్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఆమైపె దురుసుగా ప్రవర్తించినట్లు ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. సాయంత్రం వరకు జైలు రోడ్‌లోనే ఆమె సక్రమంగా విధులు నిర్వహించారని గుర్తు చేశారు. అయితే టీడీపీ నాయకులు సోషల్ మీడియా ద్వారా వక్రీకరణ వీడియోలను పోస్టు చేశారని మండిపడ్డారు. ఈ అంశాన్ని రెడ్‌బుక్ రాజ్యాంగానికి అనుకూలంగా వినియోగించుకొని చింతాడ రవికుమార్‌పై అక్రమంగా కేసులు నమోదు చేయాలని చూస్తున్నారని తెలిపారు. ఆమదాలవలస నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూన రవికుమార్ అక్రమాలపై నిరంతరం పోరాటం చేయడంతో చింతాడ రవికుమార్‌ను టార్గెట్ చేశారని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై ఇదే మాదిరిగా అక్రమంగా కేసులు నమోదు చేశారని వెల్లడించారు. వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్లిన తనపై అక్రమంగా కేసులు నమోదు చేయడంతో పాటు పోలీస్‌స్టేషన్‌లో నిర్భందించారని తిలక్ గుర్తు చేశారు. కూటమి నాయకులకు రాజకీయంగా తమతో పోరాడే శక్తి లేక ఇటువంటి అక్రమ కేసులను బనాయిస్తున్నారన్నారు. జిల్లాలో ఇటువంటి సంస్కృతి విడనాడాలని, లేకపోతే ఇదేవిధంగా రిపీట్ చేస్తామని హెచ్చరించారు.


