శ్రీకాకుళం కల్చరల్: తెలుగు భాషా పరిరక్షణ అందరి బాధ్యత అని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వీసీ డాక్టర్ కేఆర్ రజిని అన్నారు. తెలుగు రచయితల వేదిక (తెరవే) ఆధ్వర్యంలో శుక్రవారం ఒక ప్రైవేటు హోటల్‌లో జరిగిన ఉగాది సంబరాలు, పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రజిని ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ తెలుగు కవులు, జర్నలిస్టులు, రచయితలు తెలుగు భాషా సాహిత్య సంస్థల ద్వారా తెలుగు భాషను పరిరక్షిస్తున్నారని పేర్కొన్నారు. రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ పి.జగన్మోహనరావు మాట్లాడుతూ, తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతుల ప్రచారానికి తెరవే చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. తెరవే సభ్యుడు తోట గోపాలరావు రచించిన తోట వారి కథలు, స్పందన కవితా సంపుటి పుస్తకాలను వైస్ చాన్స్‌లర్ కేఆర్ రజిని ఆవిష్కరించి పంపిణీ చేశా రు. స్పందన కవితా సంపుటిని డాక్టర్ ముట్నూరు ఉపేంద్ర శర్మ సమీక్షించగా, తోట వారి కథలు పుస్తకాన్ని పీఎస్ నాగరాజు సమీక్షించారు. కవి సమ్మేళనలో కిల్లాన శ్రీనివాస్, భోగిల ఉమామహేశ్వరరావు, ఇద్ది పాపయ్యల నిర్వహణలో 50 మంది కవులు పాల్గొని స్వీయ కవితలను వినిపించారు. భోగిల ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఐఎన్‌డీ ప్రసాద్, ఇద్ది పాపయ్యలు తొలుత ప్రతిస్పందన అనే నాటికను ప్రదర్శించారు.


