● బయో గ్యాస్..
● గ్యాస్ కష్టాలను అధిగమిస్తున్న హరేకృష్ణ అక్షయపాత్ర
● రోజుకు 30వేలకు పైగా భోజనాల పంపిణీ
● కేవలం బాయిలర్లతోనే భోజనాల తయారీ
బయో గ్యాస్ ద్వారానే వంట..
అక్షయ పాత్ర ఫౌండేషన్ వంటకాలకు గాను రోజుకు పది సిలిండర్లు అవసం కాగా కేవలం ఐదు సిలెండర్లను వాడుతూ మిగిలినది పునరుత్పాదక ఇంధనాల ద్వారానే వంట చేస్తోంది. ప్రధానంగా మిగిలిపోయిన కూరగాయలు, మిగిలిన భోజనాలు ఈ బయోగ్యాస్ ప్లాంట్‌లో ఉపయోగించి రోజుకు 15 నుంచి 20 కిలోల గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తోంది. పెద్ద పెద్ద యంత్రాలను ఉపయోగించి కేవలం నీటి ఆవిరి ద్వారానే పప్పు, అన్నం, కూరగాయల కు సంబంధించి వంటను తయారు చేస్తోంది. వీటన్నింటికీ బ్రికెట్స్ బాయిలర్ ద్వారా గ్యాస్ ఉత్పత్తి చేస్తూ వంట చేస్తోంది. వీటితో పాటు అదనంగా చెక్కపొడి, కొబ్బరిపీసు, వేరుశనగ పొట్టుతో కలిసి పునరుత్పాదక శక్తి వనరుల ద్వారానే అక్షయపాత్రలోని వంటకాలు నిర్విరామంగా తయారు చేస్తున్నారు. ఈ దిమ్మలను బాయిలర్‌లో వేడి చేయడం ద్వారా వచ్చే వేడితో వంట చేస్తున్నారు. అలాగే సోలార్ ద్వారా రోజుకు 450 యూనిట్ల కరెంటు ఉత్ప త్తి చేస్తూ వంటశాలకు నిర్వహిస్తున్నారు. పాఠశాలలకు భోజనాలు సరఫరా చేసే వాహనాలను సైతం ఎలక్ట్రికల్ వెహికిల్స్‌నే వాడుతున్నారు.
శ్రీకాకుళం రూరల్:
ప్రపంచమంతా సిలిండర్ భారాన్ని మోస్తుంటే హరేకృష్ణ సంస్థకు చెందిన అక్షయ పాత్ర మాత్రం గ్యాస్ కష్టాలు దరి చేరకుండా వండి వారుస్తోంది. కేవలం బాయిలర్లతోనే భోజనాలు తయారు చేస్తోంది. శ్రీకాకుళం మండల పరిధిలోని సింగుపురం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 312 మంది విద్యార్థుల కోసం అప్పట్లో అక్షయ పాత్ర మొదలుపెట్టారు. నేడు శ్రీకాకుళంతో పాటు, గార, ఆమదావలస పాఠశాలకు సైతం 18వేల మంది విద్యార్థులకు నిత్యం భోజనాలు అందిస్తోంది. వీటితో పాటు హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో 9 అన్న క్యాంటీన్లకు గాను పదివేలు భోజనాలు సైతం ఈ సంస్థే సరఫరా చేస్తోందని సంస్థ పర్యవేక్షకులు తిలారి శ్రీనివాస్ తెలిపారు.


