232
పనిదినాలు..
శ్రీకాకుళం న్యూకాలనీ: నూతన విద్యా సంవత్సరానికిగాను జూనియర్ కళాశాలల్లో ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్త విద్యా సంవత్సరంలో సెకెండియర్ విద్యార్థులకు ఆ రోజు నుంచే తరగతులు మొదలు కానున్నాయి. ఇందుకు సంబంధించి ఇంటర్మీడియెట్ బోర్డు డైరెక్టర్/సెక్రటరీ పి.రంజిత్‌భాషా అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఇంట ర్మీడియెట్ కోర్సులను అందిస్తున్న జూనియర్ కళాశాలల్లో ఇటీవలి ఫస్టియర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు సెకెండియర్ తరగతులను ఏప్రిల్ ఒకటి నుంచి మొదలుపెడతా రు. వాస్తవానికి గత ఏడాదికి ముందు వరకు ఏటా జూన్ ఒకటి నుంచి తరగతులు ప్రారంభమవుతుండేవి. గత విద్యా సంవత్సరం నుంచి ఏప్రిల్ ఒకటి నుంచే తరగతుల ను నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.
అలాగే ప్రైవేటు కాలేజీలకు పోటీగా ఏప్రిల్ ఒకటి నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫస్టియర్ ప్రవేశాలకు అ డ్మిషన్లు మొదలుపెట్టాల ని ఆదేశాలు జారీ చేశారు.
నాడు–నేడుతో ప్రభుత్వ కాలేజీలకు కొత్తశోభ..
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం ఇప్పటికే అధికారుల ఆదేశానుసారం అడ్మిషన్ డ్రైవ్స్ (క్యాంపెయినింగ్‌లు) నిర్వహించారు. ిఫిబ్రవరి, మార్చి నెలల్లో కళాశాలలకు సమీప ప్రాంతాల్లో ఉన్న సర్కారీ పాఠశాలల్లో, గ్రామా ల్లో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు అడ్మిషన్ డ్రైవ్స్ నిర్వహించారు. ప్రభుత్వ కళాశాలల్లో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో నాడు–నేడు కార్యక్రమం ద్వారా వసతులు, సౌకర్యాలు, ల్యాబ్‌లు, డిజిటల్ వి ద్య, ఐఎఫ్‌పీ ప్యానెల్స్ పెరిగాయి.
డొక్కా సీతమ్మ పేరిట మధ్యాహ్న భోజనం అమలుచేస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు ఇంటర్ విద్య డైరెక్టర్ ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో 164 కాలేజీలు ఫంక్షనింగ్..
జిల్లాలో అన్ని యాజమాన్య జూనియర్ కళాశాలలు 164 ఫంక్షనింగ్‌లో ఉన్నాయి. వీటిల్లో 38 ప్రభుత్వ, 13 మోడల్, 25 కేజీబీవీలు, 9 సోషల్‌వెల్ఫేర్, ఒక ట్రైబల్, 6 హైస్కూల్ ప్లస్, రెండు కో ఆపరేటివ్, 70 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఫస్టియర్ పరీక్షలు రాసిన 19850 మంది విద్యార్థులు సెకెండియర్ తరగతుల్లో కూర్చోనున్నారు.
82 సెలవులు..
2026–27 విద్యా సంత్సరానికి సంబంధించి ఇంటర్ కోర్సులను అందిస్తున్న జూనియర్ కళాశాలలు 232 రోజులు పనిచేయనున్నాయి. 2026 ఏప్రిల్ 1న కాలేజీలు మొదలుకానుండగా, వేసవి సెలవులను ఏప్రిల్ 24 నుంచి జూన్ ఒకటో తేదీగా ప్రకటించారు. మళ్లీ జూన్ 1వ తేదీన పూర్తిస్థాయిలో కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఆఖరి పనిదినంగా 2027 మార్చి 18గా నిర్ణయించారు. 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 18 వరకు మొత్తం 314 రోజులు ఉండగా ఇందులో ఇందులో 232 రోజులు కళాశాలలు పని చేయనున్నాయి.
2026–27 అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసిన ఇంటర్ బోర్డు
ఏప్రిల్ 1 నుంచి సర్కారు జూనియర్ కళాశాలల్లో తరగతులు ప్రారంభం
ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు
జూన్ ఒకటి నుంచి కళాశాలలు పునఃప్రారంభం
అడ్మిషన్లు పెంచడమే లక్ష్యం
ప్రభుత్వ కళాశాలల్లో అన్ని వసతులు, సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, బ్యాగులతోపాటు మధ్యాహ్న భోజనం కూడా అమలవుతోంది. ఈ ఏడాది అడ్మిషన్లను భారీగా పెంచేందుకు ఇంటర్ విద్య ఉన్నతాధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. అన్ని కాలేజీలు అకడమిక్ క్యాలెండర్‌ను విధిగా పాటించి, అమలుచేయాల్సి ఉంటుంది. – రేగ సురేష్‌కుమార్, ఇంటర్మీడియెట్ విద్య డీవీఈఓ/ఆర్‌ఐఓ శ్రీకాకుళం


