● ఏడాదిగా మరమ్మతులకు నోచుకోని ఆర్వో ప్లాంట్
● టెక్కలి ఆస్పత్రిలో రోగులకు తప్పని తాగునీటి కష్టాలు
టెక్కలి రూరల్:
ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ టెక్కలి జిల్లా ఆస్పత్రిలోని ఉన్న ఆర్వో ప్లాంట్ గత ఏడాదిగా పని చేయడం లేదు. ఆస్పత్రికి వస్తున్న రోగులు తాగునీటికి తంటాలు పడు తున్నారు. ఎప్పటికప్పుడు దీనిపై ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. అయినా ఇప్పటికీ దాన్ని బాగు చేయకపోవడంతో ఈ ఏడాది సైతం నీటి కష్టాలు తప్పేలా లేవని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది వేసవిలో ఆర్వో ప్లాంట్ మరమ్మతులకు గురైంది. ఆ ఏడాది ఆస్పత్రికి వచ్చే రోగులు తాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడ్డారు. నీటి బాటి ల్స్ కోనుగోలు చేసుకుని తాగేవారు. కొంత మంది తమ ఇళ్ల నుంచి నీరు తెచ్చుకునే వారు. అప్పట్లో ‘సాక్షి’లో వచ్చిన వార్తలకు స్పందించి రోగులకు క్యాన్‌లతో నీటిని ఏర్పాటు చేశారు. అయినప్పటికి పూర్తిస్థాయిలో రోగులకు తాగునీరు అందివ్వలేకపోయారు.
ఈ ఏడాది అయినా ఆర్వో ప్లాంట్ మరమ్మతులు చేయించి రోగులకు తాగునీరు అందిస్తారనే ఆశ ఉన్నప్పటికీ.. ఇంత వరకు ఆర్వో ప్లాంట్ మరమ్మతులు చేయించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. వేసవిలో సైతం తాగునీటికి తంటాలు తప్పేలా లేవని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఆర్వో ప్లాంట్ మరమ్మతులు చేయించాలని పలువురు కోరుతున్నారు.


