● కత్తిపోట్లకు 19 ఏళ్ల యువకుడు బలి
● మరొకరి పరిస్థితి విషమం
● ఇసుకతోటలో దారుణం
ఎంవీపీకాలనీ: నగరంలోని ఇసుకతోట రామాల యం సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన హత్యోదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పాతకక్షల నేపథ్యంలో బొచ్చు వెంకటేష్(19) అనే యువకుడు రౌడీషీటర్ చేతిలో దారుణ హత్యకు గురవగా, బాకీ సంతోష్ అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సంతోష్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో రౌడీషీటర్ పల్లా అనీల్ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడికావడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. నిత్యం రౌడీషీటర్లను పర్యవేక్షిస్తున్నా, తరచూ కౌన్సిలింగ్‌లు ఇస్తున్నా.. ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాలివి..
రణస్థలం, పూసపాటిరేగ ప్రాంతాలకు చెందిన బొచ్చు వెంకటేష్, బాకీ సంతోష్ వరుసకు అన్నదమ్ములు. ఉపాధి నిమిత్తం వీరిద్దరూ విశాఖలో ఉంటున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పల్లా అనీల్‌పై ఎంవీపీకాలనీ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ ఉంది. గతంలో ఇతని ఆగడాలు మితిమీరడంతో పోలీసులు నగర బహిష్కరణ కూడా చేశారు. కొంతకాలం రణస్థలంలో ఉన్న అనిల్, ఇటీవల మళ్లీ నగరానికి చేరుకున్నాడు. రణస్థలంలోనే అనీల్‌కు, వెంకటేష్‌కు పరిచయాలు ఉన్నాయి. కాగా.. వెంకటేష్ భార్య విషయంలో ఇద్దరి మధ్య కొంతకాలంగా తగాదాలు నడుస్తున్నాయి. దీనిపై గతంలోనే వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మూడు నెలల కిందట పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. అయినా వీరి మధ్య వివాదం సద్దుమణగలేదు. ఇటీవల మరోసారి గొడవ జరగడంతో ‘చూసుకుందాం రా’ అంటూ వెంకటేష్ సవాల్ విసిరినట్లు సమాచారం. ఈ క్రమంలో బుధవారం రాత్రి అర్ధరాత్రి సమయంలో ఇసుకతోట రామాలయం వద్ద వెంకటేష్, అనీల్ తర ఫు వాళ్లు తలపడ్డారు. ముందస్తు పథకం ప్రకారం కత్తితో సిద్ధంగా వచ్చిన అనీల్, ఒక్కసారిగా వెంకటేష్, సంతోష్‌లపై దాడి చేశాడు. బలమైన కత్తిపో ట్లు తగలడంతో వెంకటేష్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సంతోష్ తీవ్ర గాయాలపాలవగా, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నైట్ బీట్ పోలీసులు అక్కడికి చేరుకుని సంతోష్‌ను వెంటనే కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనలో సుమారు 12 మంది యువకులు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించి, నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆదేశించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీపీ నరసింహమూర్తి గురువారం తెలిపారు.
రౌడీషీటర్ అనీల్
వెంకటేష్(ఫైల్)


