డిగ్రీ పరీక్షల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఇన్‌చార్జి అండర్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ జి.పద్మారావు మంగళవారం తెలిపారు. ఫీజు ల స్వీకరణ మే 15వ తేదీ వరకు ఉంటుందని అన్నారు. పరీక్షలు మే 26వ తేదీ నుంచి నిర్వహిస్తామని చెప్పారు. ఉదయం, మధ్యాహ్నం పరీక్షల నిర్వహణ ఉంటుందని తెలిపారు.
పోర్టు రైల్వే లైను పరిశీలన
సంతబొమ్మాళి: మూలపేట పోర్టు రైల్వే లైన్ కోసం సేకరించిన భూములను కూర్మనాథపురం వద్ద టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి మంగళవారం పరిశీలించారు. రైల్వే లైను పనులు వేగవంతం చేయాలని పోర్టు అధికారులకు సూచించారు. మార్కెట్ వ్యాల్యూ ప్రకారం తన భూమికి పరిహారం ఇవ్వలేదని గ్రామానికి చెందిన కోట రామ్మూర్తి ఆర్డీఓ దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందరికీ ఒకేలా పరిహారం ఇవ్వడం జరిగిందని ఆర్డీఓ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోర్టు జీఎం శంకర్, డిప్యూటీ తహసీల్దార్ హరి ఉన్నారు.
912 పంచాయతీల్లో 857 చలివేంద్రాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని జిల్లాలోని 912 పంచాయతీల్లో 857 చలివేంద్రాలను కలెక్టర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. 137 ప్రభుత్వ శాఖలు, 693 స్థానిక సంస్థలు, 27 స్వచ్ఛంద సంస్థలు, ఇతరుల ద్వారా ఇవి ఏర్పాటు చేస్తున్నారు. మానిటరింగ్ అధికారులను ప్రతి మండలానికి నియమించి పర్యవేక్షిస్తారు.
గొప్పిలిలో మరో
చెక్‌పోస్టుకు యోచన
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో అంతర్రాష్ట్ర నేరస్తులు చొరబడుతున్నారన్న విషయంపై ప్రత్యేకంగా నిఘా పెడుతున్నామని, ఇప్పటికే కొన్ని బృందాలు పనిచేస్తున్నాయని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం పత్రికా విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. గంజాయి, చోరీలు ఇతరత్రా నేరాల్లో వరుసగా ఒడిశా, వెస్ట్‌బెంగాల్, ఉత్తరాఖండ్, చత్తీస్‌గఢ్ తెలంగాణ వంటి రాష్ట్రాల వారిని పట్టుకుంటున్నామని, అన్నింటికీ బోర్డర్‌గా జిల్లా ఉండటమే కారణమని అన్నారు. ఇప్పటికే పర్లాఖిమిడి, పాతపట్నం, ఇచ్ఛాపురం చెక్‌పోస్టులున్నాయని, గొప్పిలిలో మరో చెక్‌పోస్టును పెట్టే యోచనలో ఉన్నామన్నారు. అంతర్రాష్ట్ర నేరగాళ్లపై బీట్‌సిస్టమ్, అనుమానితులపై సర్వేలైన్స్ పెట్టామని, ఫింగర్‌ప్రింట్ తనిఖీ చేస్తుంటామన్నారు. అంతేకాక అంతర్రాష్ట్ర అధికారులతో అక్కడి నేరస్తుల ఫింగర్‌ప్రింట్ డీటైల్స్ కమ్యూనికేషన్ అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 80 శాతం గ్రేవ్ కేసులు తగ్గాయని, చిన్నచిన్న నేరాలు మూడు శాతం పెరిగాయన్నారు.
ఒంటరి మహిళ పింఛన్ నిలిపివేత
నరసన్నపేట: ‘మా పార్టీకి అనుకూలంగా ఉండటం లేదు. మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నావు. మా ప్రభుత్వంలో నీకు ఎందుకు పింఛన్ ఇస్తాం. నువ్వు మా పార్టీకి అనుకూలంగా ఉంటేనే పింఛను ఇప్పిస్తాం’ అంటూ మండలంలోని రావులవలసకు చెందిన టీడీపీ నాయకుడు వెలమల శకుంతలకు వస్తున్న ఒంటరి మహిళ పింఛన్‌ను నిలిపివేశారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో పింఛన్ డబ్బులు ప్రభుత్వం నుంచి వచ్చినా స్థానికంగా అధికారులకు, సచివాలయ సిబ్బందికి చెప్పించి పింఛన్ పంపిణీ చేయకుండా నిలిపివేయించారు. దీంతో శకుంతల తనకు వచ్చే ఒంటరి మహిళ పింఛన్ పునరుద్ధరించాలని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. శకుంతలకు వ్యతిరేకంగా రా వులవలసలో సచివాలయ సిబ్బందితో ఎంకై ్వరీ రిపోర్టు కూడా ఒత్తిడి చేసి రాయించినట్లు తెలుస్తోంది. నెల వారీ వచ్చే పింఛన్ రాకపోవడంతో శకుంతల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫించన్ ఇవ్వాలని మంగళవారం మరో మారు స్థానిక ఎంపీడీఓ మధుసూదనరావుకు వినతి పత్రం అందజేశారు.


