భారీగా గంజాయి పట్టివేత
ఇచ్ఛాపురం: పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు స్థానిక రైల్వే ఎల్‌సీ గేట్ వద్ద పట్టణ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా 86.950 కేజీలు భారీగా గంజాయి పట్టుబడినట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం సీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశాకి చెందిన ఒక కారులో తరలిస్తున్న గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఒడిశాలోని బరంపురం లంజిపల్లికి చెందిన ప్రపుల్‌కుమార్ జలి అనే వ్యక్తి కారులో గంజాయిని తీసుకొని విజయనగరంలోని హిమాన్సుశేఖర్ మజి అనే వ్యక్తికి ఇచ్చేందుకు తీసుకెళ్తుండగా పట్టణ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ గంజాయిని ఒడిశాలోని మోహన బ్లాక్ గుమిగుడ ప్రాంతానికి చెందిన ప్రశాంత్ నాయక్ వద్ద నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడిని అదుపులోనికి తీసుకొని అతని వద్దనుంచి గంజాయి, సెల్‌ఫోన్, కారుని సీజ్ చేశారు. రిమాండ్ నిమిత్తం కోర్టుకి తరలించనున్నట్లు పేర్కొన్నారు.


