అదే మేలిమలుపు
పొదుపు..
అదుపు..
కాలగతిలో మరో ఏడాది మలిగిపోతున్నది. కోటి ఆశలు రేపుతూ కొత్త వత్సరాది ఆహ్వానం పలుకుతోంది. ఆ ఆశలు ఫలించాలంటే.. జీవితం కొత్త మార్పులను అందిపుచ్చుకొని కొత్త పుంతలు తొక్కాలంటే .. జీవన ప్రణాళికలో మార్పులు చేసుకోవాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా పొదుపు, అదుపు, మదుపు పాటించాలి. మీ జీవితం, మీ కుటుంబం మీకే సొంతం.. వాటిని తీర్చిదిద్దుకోవడంలో మీరే నిర్ణేతలు కావాలి. ఆ నిర్ణయాలు మిమ్మల్ని విజేతలుగా నిలబెట్టేలా ఉండాలి. ఇదే అందరి కొత్త సంవత్సర లక్ష్యం కావాలి.
ఇచ్ఛాపురం రూరల్:
ఎన్నో ఆనందాలు.. అనుభవాలు.. విషాదాలు.. వివాదాలను చరిత్రలో కలిపేస్తూ 2025 ఏడాది ముగిసింది. సరికొత్త ఆలోచనలకు 2026 స్వాగతం పలుకుతోంది. ఎప్పటిలాగే ఈసారి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. దురల వాట్లు మానేద్దామని కొత్త సంవత్సరం ప్రారంభంలో మూడు, నాలుగు రోజుల పాటు నిష్టగా నియమాలను కొనసాగిస్తాం. అయితే వివిధ కారణాలతో ఎప్పటిలాగే అవే అలవాట్లను పునఃప్రారంభిస్తాం. ఈ బలహీనతలే కాలం గడుస్తున్న కొద్దీ మార్చుకోలేని వ్యసనాలుగా మారిపోయి, మనల్ని, మన కుటుంబాలను కూడా ప్రభావితం చేస్తాయి. అందుకే ఈ సారి తీసుకునే నిర్ణయాలను కచ్చితంగా అమలు చేసేందుకు కట్టుబడి ఉందాం.
మనకూ ఉండాలో రాజ్యాంగం..
పాలన వ్యవస్థకు రాజ్యాంగ అనుసరణ ఎంత ముఖ్యమో.. కుటుంబ నిర్వహణకు ఓ రాజ్యాంగం ఉండి తీరాలి. పెరుగుతున్న ఖర్చులు, సరిపడని జీతం, శుభకార్యాలు, ఏటా పెరిగే ద్రవ్యోల్బణం.. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని, రోజువారీ ప్రణాళికను ఒకరోజు ముందే తయారు చేసి పెట్టుకోవడం మంచిది.
వ్యసనాలు వదిలేద్దాం..
మద్యపానం, ధూమపానం, జూదం తదితర వ్యసనాల వల్ల ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా చితికిపోవడం ఖాయం. వీటికి దూరంగా ఉండాలన్న నిర్ణయాన్ని కచ్చితంగా పాటించి తీరాలి.
పొదుపు మంత్రం..
చేసే పని, ఉద్యోగం ఏదైనా సరే అందులో కనీసం 30 శాతం పొదుపు చేయాలన్న నిర్ణయం ఐదేళ్లలో మిమ్మ ల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. ప్రతి వంద రూపాయల్లో రూ.30 దాచిపెడితే అది మిమ్మల్ని సమాజంలో ఎవరి ముందూ చేయి చాచే అవసరం లేకుండా చేస్తుంది. అలాగే, మనపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు మనం నమ్మకంగా ఇవ్వగలిగింది జీవిత బీమా, ఆరోగ్య బీమా. వాటిలో సరైనవి ఎంచుకోవాలి.
బరువు కాదు..పరువు
ఏటా కాలంతో పాటు సమాజంలో మన పరువు పెరగాలి.. అంతే తప్ప బరువు కాదని అందరూ గుర్తించాలి. రోజుకో అరగంట వ్యాయామం, వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ ఏదైతే అది చేయాలి.
మీకు మీరే పోటీ..
జీవితంలో విజేతలుగా మారాలంటే వేరెవరితోనూ పోల్చుకోనవసరం లేదు. మీరు పోల్చు కోవాల్సింది నిన్నటి వరకు ఉన్న మీతో.. ఏడాది తర్వాత మీరుండాలని కోరుకున్న మీతోనే పోల్చుకోవాలి. మీకు మీరే పోటీపడండి.
ప్రణాళికతోనే జీవన వికాసం
సరికొత్తగా ఏడాదిని ప్రారంభిద్దాం
దురలవాట్లను దూరం పెడదాం
మంచి మార్గానికి బాటలు వేద్దాం
మార్పు దిశగా..
2025 పాత అలవాట్లకు గుడ్ బై చెబుతూ కొత్త ఆలోచనలతో ముందుకెళ్లాలి. ఉరుకులు పరుగుల జీవితంలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి మెడిటేషన్ చేస్తూ ఆధ్మాత్మిక చింతనలో గడపాలి. కోరికలు తగ్గించి, సమయం వృథా కాకుండా ముందస్తు ప్రణాళికతో 2026లోకి అడుగుపెట్టాలి. ఆర్థిక నియమాలను పాటిస్తూ పొదుపు, సామాజిక బాధ్యతలను గుర్తించి మంచి మార్పునకు కృషి చేయాలి. – దూగాన చిరంజీవులు,
రిటైర్డ్ అడిషనల్ చీఫ్ జడ్జి, సోంపేట
అదే మేలిమలుపు
అదే మేలిమలుపు
అదే మేలిమలుపు


