వినరో భాగ్యము
● శ్రీకూర్మ క్షేత్రంలో 44 ఏళ్లుగా గోదాగోష్టి
● ధనుర్మాస వేళ శ్రీకూర్మనాథాలయంలో ప్రత్యేక ఉత్సవం
గార: పవిత్ర శ్రీకూర్మ క్షేత్రంలో 44 ఏళ్లుగా ఆండాల్ గోదాగోష్టి పేరిట గ్రామ సంకీర్తన కొనసాగుతోంది. గోదా దేవి శ్రీకృష్ణుని పొందే విధానాన్ని వివరిస్తూ శ్రీకృష్ణుని చిత్రపటాన్ని పట్టుకొని శ్రీకూర్మనాథాలయ తిరువీధుల్లో ధనుర్మాస వేకువల్లో సంకీర్తన జరుపుతున్నారు. తొలుత శ్రీభాష్యం తిరువేంగలమ్మ, శ్రీభాష్యం అనంత లక్ష్మమ్మ ప్రారంభించగా, 20 ఏళ్లుగా తిరుమల పెద్దింటి సుశీలరాణి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. శ్రీకృష్ణుని లీలలు వివరించే గీతాలను మహిళలు ఆలపిస్తారు. ఇంటి వద్ద భక్తులు మేలుకొలుపు వద్ద ఉన్న స్వామి చిత్రపటానికి హారతినివ్వడంతో పాటు దక్షిణలు సమ ర్పిస్తారు. ఇలా వచ్చిన డబ్బులతో గోదాదేవి కల్యా ణం రోజున మంగళసూత్రం, ప్రసాదాలను శ్రీకూర్మనాథాలయానికి అందించి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ప్రతి రోజూ 5 గంటల తర్వాత శ్రీకూర్మనాథాలయంలో తిరుప్పావై ప్రవచనాల ముందుగా జరిగే బేడా సేవలో మహిళలతో పాటు భక్తులు పా ల్గొంటారు. ఆలయ ప్రధానార్చకులు సీహెచ్ సీతారామనృసింహాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు పల్లకిలో గోదాదేవి మూర్తితో పాటు సుదర్శన ఆళ్వా ర్ మూర్తులను ఎదురెదుగా ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ప్రధాన గోపురం చుట్టూ ఉన్న బేడా మంటపంలో బేడా సేవ నిర్వహించి శ్రీకూర్మనాయకి సన్నిధిలో తిరుప్పావై పఠనం నిర్వహిస్తారు.


