మద్యం తాగేశారు
● డిసెంబరు 31 రాత్రి విపరీతంగా మద్యం విక్రయాలు
డిసెంబర్ 31 అర్ధరాత్రి మందు ప్రియులు ‘ఫుల్లు’గా ఎంజాయ్ చేశారు. ఎప్పటికంటే దాదాపు దాదాపు కోటి రూపాయల అదనపు మద్యాన్ని గుటకేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మద్యం ప్రియులు డిసెంబరు 31న రూ.3.75 కోట్ల మందు తాగేశారు. అర్ధరాత్రి వరకు ప్రభుత్వం విక్రయాలకు ఇచ్చిన అనుమతిని వినియోగించుకుని మందుషాపుల గల్లా పెట్టెలు నింపారు. ఈ మేరకు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సీహెచ్ తిరుపతినాయుడు ఓ ప్రకటన గురువారం విడుదల చేశారు. సాధారణ రోజుల్లో రూ. 2.50 కోట్ల నుంచి రూ. 2.70 కోట్ల సరాసరిన మద్యం అమ్మకాలు జరిగేవని ఆ లెక్కన రూ.1.20 కోట్లు మద్యం అధికంగా అమ్ముడు పోయిందని ఆయన అన్నారు. శ్రీకాకుళం సర్కిల్ పరిధిలో రూ. 80 లక్షల మేర మద్యం అమ్మకాలు సాగినట్లు సీఐ ఎంవీ గోపాలకృష్ణ ప్రకటించారు. సాధారణ రోజుల్లో రూ. 60 లక్షలు అమ్మకాలు సాగేవన్నారు.
మందుబాబులపై కేసులు..
జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ 36, ఓపెన్ డ్రింకింగ్ 15 కేసులు నమోదు చేశారు. శ్రీకాకుళం నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఒకటో పట్టణ పరిధిలో 14, ట్రాఫిక్ పీఎస్ పరిధిలో 6 నమోదు కాగా రెండో పట్టణ పరిధిలో 4 ఓపెన్ డ్రింకింగ్ కేసులు పోలీసులు కట్టారు. వీరిని శుక్రవారం కోర్టు ముందు హాజరుపర్చనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మద్యం అమ్మకాలకు సమయం ఒంటి గంట వరకు పెట్టిన ప్రభుత్వం రోడ్లపై మద్యం తాగి తిరగవద్దని, అదే ఒంటి గంట తర్వాత తిరిగితే కేసులు కట్టి జైలుకు పంపిస్తామని పోలీసుల చేత ప్రకటించడంపై జిల్లావ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.
– శ్రీకాకుళం క్రైమ్
మద్యం తాగేశారు
మద్యం తాగేశారు


