సాక్షి, పుట్టపర్తి
ప్రజల మద్దతు కోల్పోయిన కూటమి నేతలు ‘పరిషత్ పోరు’లో రౌడీయిజం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు తెగబడుతూ భయభ్రాంతులకు గురి చేశారు. పోలింగ్ కేంద్రాల నుంచి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటికి పంపించి దొంగ ఓట్లు గుద్దుకున్నారు. నియంత్రించాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. పోలింగ్ కేంద్రాల సమీపంలోనే కూటమి నేతలు పార్టీ కండువాలు వేసుకుని ప్రచారం చేస్తూ.. నగదు పంపిణీ చేస్తున్నా పట్టించుకోని పోలీసులు... ఇదేంటని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నేతలపై లాఠీలు ఝుళిపించారు. గురువారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలింగ్ ఏకపక్షంగా సాగింది. నిజమైన ఓటరు లేకున్నా.. కూటమి నేతలు బూత్‌లలోకి చొరబడి దొంగలతో ఓట్లు వేయించారు. అందువల్లే మధ్యాహ్నం వరకు మోస్తరుగా సాగిన పోలింగ్.. ఆ తర్వాత కూటమి నేతల రిగ్గింగ్‌తో ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోయింది.
రెచ్చిపోయిన మంత్రి సవిత గ్యాంగ్..
మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గంలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఇంటి వద్దకు వచ్చి గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న గోరంట్ల సీఐ శేఖర్.. అక్కడికి వెళ్లి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై బూతులతో రెచ్చిపోయారు. లాఠీ ఝుళిపిస్తూ వీరంగం చేశారు. కొందరు పచ్చ గూండాలు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో గొడవకు దిగుతుండగా.. మరోవైపు ఇంకొందరు పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఇష్టారాజ్యంగా రిగ్గింగ్ చేశారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటికి పంపించి దొంగ ఓట్లు వేసుకున్నారు.
అన్ని చోట్ల అదే తీరు..
జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూటమి నేతల దౌర్జన్యం కొనసాగింది. అధికారులు, పోలీసులు జీ హుజూర్ అంటూ తలొగ్గారు. నల్లమాడ, కదిరి, గోరంట్ల, చెన్నేకొత్తపల్లి, చిలమత్తూరు, ముదిగుబ్బ తదితర మండలాల్లోనూ కూటమి నేతలు హల్‌చల్ చేశారు. కదిరిలో వైఎస్సార్‌సీపీ జెడ్పీ చైర్మన్ అభ్యర్థి వజ్రభాస్కర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. కొత్తచెరువులో పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించలేదని ‘తెలుగు తమ్ముళ్లు’ గొడవకు దిగారు. అగళి మండలం ఆర్‌జీపల్లిలో చనిపోయిన వారి పేర్లతోనూ ఓట్లు వేశారు. పచ్చమూకలు రిగ్గింగ్‌లు చేస్తూ వైఎస్సార్ సీపీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల నుంచి గెంటివేయడంతో ముదిగుబ్బ, చిలమత్తూరులో వారు ఆందోళనలకు దిగారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో
కూటమి నేతల రౌడీయిజం
వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటికి
పంపించి దొంగ ఓట్ల పోలింగ్
హిందూపురం, పెనుకొండ, రాప్తాడు నియోజకవర్గాల్లో భారీ రిగ్గింగ్
నల్లమాడ, గోరంట్ల, చిలమత్తూరు,
కదిరిలో కూటమి నేతల హల్‌చల్
పరిటాల అనుచరులు, బాలయ్య పీఏలు, మంత్రి సవిత గ్యాంగ్ దౌర్జన్యం
దాడులను నియంత్రించకుండా
ప్రేక్షకపాత్ర పోషించిన పోలీసులు


