పుట్టపర్తి అర్బన్: మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ శ్యాం ప్రసాద్ గురువారం పరిశీలించారు. ఉదయం మండల పరిధిలోని కప్పలబండ, జగరాజుపల్లి తదితర గ్రామాల్లో పర్యటించారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి వెబ్‌క్యాస్టింగ్, సిబ్బంది పనితీరు, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. ఆయన వెంట ఎన్నికల అధికారులు, సిబ్బంది ఉన్నారు.
జర్నలిస్టుపై సీఐ దౌర్జన్యం
పుట్టపర్తి టౌన్: నల్లమాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద విధినిర్వహణలో ఉన్న సీనియర్ జర్నలిస్టు, ఏపీజేడబ్ల్యూజేఎఫ్ జిల్లా కోశాధికారి బాబ్జాన్‌పై సీఐ శ్రీనివాసులు దురుసుగా ప్రవర్తించారు. పోలింగ్ కేంద్రం ఆవరణలో జరుగుతున్న ఘటనలను చిత్రీకరిస్తుండగా.. సీఐ అడ్డుకున్నారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ బెదిరించారు. తాను అక్రిడేటెడ్ జర్నలిస్టునని, కలెక్టర్ ఇచ్చిన అక్రిడిటేషన్ కార్డు చూపించగా... దాన్ని లాక్కుని బెదిరించడంతో పాటు పక్కకు తోసేశారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు శివరామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సీఐ శేఖర్ తీరుకు
నిరసనగా ధర్నా
గోరంట్ల: మంత్రి సవిత కనుసన్నల్లో నడుస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు, ఏజెంట్లు, చివరకు అభ్యర్థులను వేధిస్తున్న గోరంట్ల సీఐ శేఖర్ తీరును నిరసిస్తూ గురువారం మలసముద్రం గ్రామంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ధర్నాకు దిగారు. గురువారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందరంగా సీఐ శేఖర్ వైఎస్సార్ సీపీ నాయకులు, ముఖ్య నేతలను టార్గెట్ చేశారు.
ఈ క్రమంలో ఉదయమే మలసముద్రానికి వెళ్లిన సీఐ శేఖర్ ఓ ఇంట్లో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తను, అతని కుటుంబీకులను తీవ్ర పదజాలంతో దూషించారు. సిబ్బందితో చుట్టుముట్టి భయభ్రాంతులకు గురిచేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ వెంటనే అక్కడకు చేరుకుని సీఐ తీరును ఎండగట్టడంతో పాటు కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగారు. దీంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలాగే పులేరు గ్రామంలో వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ ఏజెంట్‌ను సీఐ చొక్కా పట్టుకొని పోలింగ్ బూత్ నుంచి బయటకు ఈడ్చుకురావడంపై ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. అలాగే బూదిలి గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డిపై సీఐ దుర్భాషలాడారు. సీఐ వ్యవహారశైలిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు ఉషశ్రీచరణ్ తెలిపారు.
తురకవారిపల్లిలో
రిగ్గింగ్‌కు విఫలయత్నం
తాడిమర్రి: తాడిమర్రి మండలం తురకవారిపల్లిలో టీడీపీ నాయకులు రిగ్గింగ్‌కు విఫల యత్నం చేశారు. పోలింగ్ ప్రారంభం కాగానే మండలానికి చెందిన ప్రముఖ టీడీపీ నేత, వైఎస్సార్ జిల్లా పార్నపల్లి గ్రామానికి చెందిన అతని బావ సుమారు 50 మందితో కలిసి ఉదయం 6 గంటలకే పోలింగ్ స్టేషన్‌లో తిష్టవేశారు. రిగ్గింగ్‌కు ప్రయత్నిస్తుండగా... విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నేత గరుడమ్మగారి రూపేష్‌రెడ్డి తాడిమర్రి పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్‌ఐ కృష్ణవేణి సిబ్బందితో వెళ్లి టీడీపీ నాయకులు, కార్యకర్తలను చెదర గొట్టారు. పోలీసులు వెళ్లిపోగానే మరోసారి రిగ్గింగ్‌కు ప్రయత్నించగా.. పీఓ (మహిళ)తో పాటు స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. చివరకు మధ్యాహ్నం 2 గంటల సమయంలో వైఎస్సార్ జిల్లా కల్లూరు, కొత్తపల్లి, సింగారం, చింతకాయమంద, వెలిదెండ్ల తదితర గ్రామాల నుంచి వచ్చిన వారితో కలసి మరోసారి రిగ్గింగ్ కోసం పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడానికి ప్రయత్నించగా... పీఓ (మహిళ)తో పాటు గ్రామానికి చెందిన పొత్తూరు శేషం నాయుడు, పొత్తూరు విశ్వనాథ్, జేసీబీ రాజుతో పాటు పలువురు గ్రామస్తులు అడ్డుకున్నారు.


