హిందూపురం(చిలమత్తూరు): ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం అధికారులు బ్యాలెట్ బాక్సులను హిందూపురంలోని పాలిటెక్నిక్ కళాశాలకు చేర్చారు. అయితే పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యుత్ సరఫరా లేదు. దీంతో ఏమి చేయాలో పాలుపోక మొబైల్ టార్చ్‌లతోనే వివరాలు నమోదు చేసి, బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ అధికారులకు అప్పజెప్పారు. అయితే, ఎందుకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందనేదానికి అధికారులు సమాధానం చెప్పకపోవడంపై అభ్యర్థులో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హిందూపురం రూరల్, చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో జరిగిన పోలింగ్ బ్యాలెట్ బాక్సులు అన్నీ ఇక్కడికి చేర్చారు. కాగా, ఈ నెల 7న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.
ఎన్నికల ఫలితాలపై అనుమానాలు
పెనుకొండ రూరల్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై అనుమానాలున్నాయని జనసేన పార్టీ రెబల్ అభ్యర్థి లోకేష్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో రెండోవార్డు అభ్యర్థిగా జనసేన నాయకుడు లోకేష్ రెబల్ అభ్యర్థిగా పోటీచేశాడు. పోలింగ్ రోజున వార్డులో పోలైన ఓట్లు 854 అని, అయితే కౌంటింగ్ సమయంలో 853 ఓట్లుగా అధికారులు నివేదిక ఇవ్వడంపై అనుమానం వ్యక్తం చేశాడు. అధికారుల తీరుపై స్పష్టత లేదని, పోలింగ్, కౌటింగ్ ప్రక్రియలు, స్ట్రాంగ్ రూమ్ భద్రత, సీసీ ఫుటేజీలు, కౌంటింగ్ ప్రక్రియలో 50 ఓట్లు కట్టలు కట్టే విధానంపై అనుమానాలకు బలం చేకూర్చిందని వీడియోలో తెలిపారు. పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు అన్ని రికార్డులు భద్రపరిచి, అధికారులు పరిశీలించాలన్నాడు. ఎన్నికల అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని, తనకు న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తానని సోషల్ మీడియా వేదికగా ఆయన పంచుకున్నాడు.
‘హస్తం’ గుర్తు మాయం
పరిగి: మండలంలోని కొడిగెనహళ్లి పంచాయతీ పరిధిలోని పోలింగ్‌బూత్‌లలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును జెడ్పీటీసీ అభ్యర్థుల ఇండెక్స్ బోర్డులో ప్రచురించకపోవడంపై ఆపార్టీ అభ్యర్థి ఎంఎస్ శ్రీనివాసులు తీవ్ర అసహనానికి గురయ్యారు. గురువారం మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున జెడ్పీటీసీ బరిలో ఎంఎస్ శ్రీనివాసులు నిలిచిన అంశంలో పోలింగ్‌బూత్‌లలో అభ్యర్థి పేరు మాత్రమే ప్రచురించి, గుర్తును ప్రచురించకపోవడంపై ఆయన అధికారులతో వాగ్వాదం చేశారు.
పోలింగ్ కేంద్రాల పరిశీలన
గోరంట్ల: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ తీరును జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్యాంప్రసాద్ స్వయంగా పరిశీలించారు. గురువారం ఆయన గోరంట్ల బాలుర ఉన్నత పాఠశాల ఆడిటోరియంలోని పోలింగ్ కేంద్రాన్ని, బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 256, 257 పోలింగ్ కేంద్రాలతో పాటు మందలపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఆయా కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఉండడాన్ని గమనించిన కలెక్టర్..ఆయా బూత్‌లలో ఓటర్ల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి పోలింగ్ సవ్యంగా నిర్వహించాలని ఆదేశించారు. అంతకుముందు అడిషనల్ ఎస్పీ అంకిత సురానా కూడా గోరంట్ల బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
పోలింగ్ సరళి పరిశీలన
పుట్టపర్తి టౌన్: కొత్తచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఓటింగ్ సరళిని గురువారం జిల్లా ఎన్నికల పరిశీలకుడు అరుణ్‌బాబు పరిశీలించారు. ఎన్నికల అధికారులతో పోలింగ్‌పై ఆరా తీశారు. నిరంతరం పర్యవేక్షిస్తూ ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ సువర్ణ ఉన్నారు.


