కూడేరు/ధర్మవరం అర్బన్: కూడేరు మండల పరిధిలోని కడదరకుంటలో పోలింగ్ బూత్‌లో విధులు నిర్వహిస్తున్న ఓపీఓ హరిత గౌడ్ (57) గుండె పోటుతో మృతి చెందారు. వివరాలు.. గురువారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ బూత్‌లో హరిత విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఆమె ఆస్వస్థకు గురయ్యారు. ఈ విషయాన్ని ఆమె పీఓ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆయన కొద్దిసేపు పక్కకెళ్లి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అక్కడే ఉన్న ఏఎన్‌ఎం ఆమెను పరీక్షించి కూడేరులోని పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ డాక్టర్ వెంకట ప్రసాద్ వైద్య సేవలందించారు. ఆమెకు బీపీ, షుగర్ ఉండడంతో కొద్ధి సేపటి తర్వాత గుండె పోటుతో మృతి చెందారు. ఈమె డీహీరేహాళ్ మండలం కాదలూరు పాఠశాలలో ఎస్‌జీటీ ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నారు. సమాచారమందుకున్న ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు పీహెచ్‌సీకి చేరుకొని మృత దేహాన్ని తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా విశ్రాంతి తీసుకునేందుకు పీఓ అనుమతించకపోవడంతోనే ఆరోగ్య పరిస్థితి విషమించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఉపాధ్యాయురాలి కుటుంబాన్ని ఆదుకోవాలి..
ఎన్నికల విధుల్లో ఆకస్మికంగా మృతిచెందిన టీచర్ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణనాయక్, కార్యదర్శులు అమర్‌నారాయణరెడ్డి, నాగేంద్రమ్మ, రాష్ట్ర కౌన్సిలర్ మేరివరకుమారి, డివిజన్ నాయకులు ఆంజనేయులు, వెంకటకిషోర్, హరికృష్ణ, రామాంజనేయులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురం జిల్లా కూడేరు మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలు హరితగౌడ్ ఎన్నికల విధుల్లో ఉంటూనే అనారోగ్యంతో మృతిచెందడం బాధాకరమని ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఎన్నికల విధుల్లో మృతిచెందిన టీచర్‌కు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని కోరారు.
పీహెచ్‌సీలో చికిత్స పొందుతూ మృతి


