హిందూపురం(చిలమత్తూరు): హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు గూండాల్లా వ్యవహరించారు. పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు గెంటేసి యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. మరో గంటలో పోలింగ్ ముగుస్తుందనగా బాలకృష్ణ పీఏలు శ్రీనివాసరావు, బాలాజీ, సురేంద్ర చిలమత్తూరు పోలింగ్ కేంద్రాల్లో హల్‌చల్ చేశారు. చిలమత్తూరు–4వ ఎంపీటీసీ సెగ్మెంట్ పోలింగ్ బూత్‌లో ఉన్న వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై దాడికి యత్నించారు. ఓటర్లను, వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బెదిరించారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన డీఎస్పీ రవిబాబు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, ఏజెంట్లనే బయటకు తోసేసి వారికి సహకరించారు. దీంతో ఆగ్రహించిన వైఎస్సార్‌సీపీ నేతలు, ఏజెంట్లు పోలింగ్ కేంద్రం గేటు బయట నిరసనకు దిగారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు అందరినీ చెదరగొట్టారు.
జెడ్పీటీసీ నిర్బంధం
● ఉదయం చిలమత్తూరు జెడ్పీహెచ్‌ఎస్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన జెడ్పీటీసీ అభ్యర్థి పురుషోత్తమరెడ్డిని పోలీసులు గంటన్నర పాటు నిర్బంధించారు. అనంతరం జెడ్పీటీసీ అభ్యర్థితో పాటు ఎంపీటీసీ అభ్యర్థులను బయటకు నెట్టివేశారు. వైఎస్సార్ సీపీ నేతలు ధర్నాకు సిద్ధంగా కాగా, అభ్యర్థులను మాత్రం పోలింగ్ కేంద్రంలోకి వదిలారు. ఈ లోపు కూటమి నేతలు భారీగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఇక హిందూపురం రూరల్ మండలం గొల్లాపురంలో పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపికపై దురుసుగా ప్రవర్తించారు. ఓటర్లను ప్రలోభపెడుతున్న టీడీపీ నాయకులను ఆమె అడ్డుకునేందుకు ప్రయత్నించగా...పోలీసులు దీపికనే నెట్టివేశారు.
టీడీపీ నేతలా వ్యవహరించిన డీఎస్పీ
హిందూపురం డీఎస్పీ రవిబాబు టీడీపీ నేతలా వ్యహరించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏల ఆదేశాలతో అన్నీ తానై ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నడిపించారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై బూతులు తిడుతూ లాఠీ చార్జీ చేయించారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అరెస్టు చేశారన్న సమాచారంతో చిలమత్తూరు పోలీసు స్టేషన్ వద్ద వెళ్లిన ‘సాక్షి’ విలేకరి శ్రీధర్‌రెడ్డిపై కూడా డీఎస్పీ రవిబాబు బూతులతో రెచ్చిపోయారు.
పోలింగ్ బూత్‌ల్లోకి చొరబడి హల్‌చల్
వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను
బయటకు గెంటేసి రిగ్గింగ్


