గుత్తి రూరల్: మండలంలోని కొత్తపేట గ్రామ శివారులో 67వ నంబర్ జాతీయ రహదారిపై బొలెరో బోల్తా పడి ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు... గుత్తి మండలం కొత్తపేటకు చెందిన నవీన్, అనగానదొడ్డి గ్రామానికి చెందిన మదన్ కుమార్, కేశవ, జి.అశోక్‌కుమార్, ఎం.అశోక్, ఈశ్వర్‌లు ప్రికాస్ట్ ప్రహరీ నిర్మాణాల పనులకు వెళ్లేవారు. సోమవారం యాడికిలో ప్రహరీ నిర్మాణానికి స్తంభాలను బొలెరోలో లోడు చేసుకుని బయలుదేరారు. కొత్తపేట గ్రామ శివారులో శ్రీకృష్ణ మందిరం సమీపంలో ముందు వెళ్తున్న ఆటోను బొలెరో ఓవర్ టేక్ చేయబోయింది. ఈ క్రమంలోనే యాక్సిల్ కట్ కావడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. బొలెరోలో ఉన్న దిమ్మెలు మీద పడి నవీన్, మదన్ కుమార్, కేశవ, జి.అశోక్‌కుమార్, ఎం.అశోక్, ఈశ్వర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని ఆటో, అంబులెన్స్‌లలో గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వ్యక్తి అనుమానాస్పద మృతి
ఓడీచెరువు (నల్లమాడ): నల్లమాడ మండలంలోని అరవాండ్లపల్లి శివారు మంగళిగుట్టలో 45 నుంచి 50 సంవత్సరాల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకొని మృతి చెందినట్లు నల్లమాడ వీఆర్వో విజయ్ నల్లమాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.10 రోజుల క్రితమే ఉరి వేసుకుని ఉండవచ్చని పేర్కొన్నారు. మృతదేహం పక్కన బ్లూ కలర్ ఫుల్ షర్ట్, పంచె, జత చెప్పులు ఉన్నాయని తెలిపారు.
అనుమానంతోనే అంతమొందించాడు
అనంతపురం సెంట్రల్: నగరంలోని యల్లమ్మ కాలనీలో ఈనెల 10న జరిగిన హత్య కేసును వన్‌టౌన్ పోలీసులు ఛేదించారు. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు.. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మంలం పోతులకుంట గ్రామానికి చెందిన మహేష్‌కు గతంలో పెనుకొండకు చెందిన ఓ మహిళతో వివాహమైంది. ఆమెను పదేపదే వేధిస్తుండడంతో విడాకులు ఇచ్చింది. దీంతో గుంటూరుకు చెందిన శాంతిని మహేష్ రెండో వివాహం చేసుకొని ఇటీవల నగరంలో యల్లమ్మకాలనీలో కాపురం పెట్టాడు. అయితే ఆమైపె కూడా అనుమానం పెంచుకున్నాడు. ఈ నెల 10న ఇరువురి మద్య ఘర్షణ తలెత్తింది. విచక్షణ కోల్పోయిన మహేష్ రోకలిబండతో కొట్టి ఆమెను హతమార్చిన అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం టీవీ టవర్ సమీపంలో మహేష్‌ను అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
వ్యక్తి దారుణహత్య
అనంతపురం సెంట్రల్: వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన నగరంలోని సంఘమిత్ర కాలనీ శివారులో జరిగింది.నాల్గో పట్టణ సీఐ ఏపీ మస్తాన్ తెలిపిన మేరకు.. సోమవారం సంఘమిత్ర కాలనీ శివారులో మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.తలపై సిమెంట్ దిమ్మె వేసి హతమార్చినట్లు వెల్లడైంది. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. ఆదివారం రాత్రి ఘటన చోటు చేసుకున్నట్లు అంచనాకు వచ్చారు. మృతుడి వయసు 30 సంవత్సరాలు ఉండవచ్చని, నీలం రంగు నైట్ ప్యాంట్, కాఫీ రంగు ఫుల్ షర్టు ధరించి ఉన్నాడని సీఐ తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
ఉరవకొండ: పెన్నహోబిలంలో ఆమిద్యాల రోడ్డు వైపు కోడిగుట్ట చేను సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఎస్‌ఐ జనార్దన్‌నాయుడు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయసు 45 నుంచి 50 సంవత్సరాలు ఉంటుంది. ఆకుపచ్చ రంగు టీషర్ట్, జీన్స్‌ప్యాంట్, చెప్పులు ధరించి ఉన్నాడు. మృతదేహం పక్కన ఒక బ్యాగ్ లభించింది. అందులో పెన్‌డ్రైవ్, చార్జర్, కత్తెర, కళ్లద్దాలు, తెల్లటి షర్ట్ ఉన్నాయి. ఎవరికై నా ఆచూకీ తెలిస్తే వెంటనే సీఐ సెల్: 9490108514, ఎస్ సెల్: 9440740876కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.


