మడకశిర: జిల్లాలో కర్ణాటక సరిహద్దుకు ఆనుకుని ఉన్న మడకశిర నియోజకవర్గంలో శ్రీకృష్ణదేవరాయలు కాలంలో పెద్ద ఎత్తున చెరువులను నిర్మించారు. ఈ చెరువుల్లో వృక్ష సంపద అధికంగా ఉంది. ప్రధానంగా తుమ్మచెట్లు పెద్ద ఎత్తున పెరిగాయి. తుమ్మచెట్ల దుంగల ద్వారా ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సామగ్రి తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. తలుపులు, కిటికీలు, మంచాలు, దూలాలు తదితర వాటిని తయారు చేయవచ్చు. ఇంటి సామగ్రికి ఉపయోగపడని దుంగలను బొగ్గుల తయారీకి ఉపయోగిస్తారు.
సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు..
ఎంతో విలువైన తుమ్మ చెట్లను కొంత మంది అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. తొలుత తుమ్మచెట్లను నరికి దుంగలుగా చేసి రాత్రికి రాత్రి వాహనాల్లో కర్ణాటక సరిహద్దుకు తరలిస్తున్నారు. అక్కడ బట్టీల్లో కాల్చి బొగ్గుగా మార్చి కర్ణాటకలోని బెంగళూరు, శివమొగ్గ, దావణగెరె, చిత్రదుర్గకు తరలించి జేబులు నింపుకుంటున్నారు. మడకశిర నియోజకవర్గంలోని 5 మండలాల పరిధిలో 47 మైనర్ ఇరిగేషన్ చెరువులు ఉండగా, దాదాపు అన్ని చెరువుల్లో అక్రమార్కులు చెట్లను నరికివేసి అక్రమార్జన సాగిస్తున్నారు. ఫిర్యాదు చేసినా జలవనరులశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు.
పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు..
అమరాపురం మండలం పురవరం చెరువులో తుమ్మ చెట్ల నరికివేతపై మే 25న కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో ఆయకట్టు రైతు ఈశ్వరప్ప తదితరులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 30 రోజుల్లో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించినా జలవనరుల శాఖ అధికారులు చర్యలు తీసుకోలేదు. దీంతో రెండు రోజుల క్రితం మరోసారి పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు ఆయకట్టు రైతులు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఈ సందర్భంగా జలవనరుశాఖ అధికారులపై సీరియస్ అయినట్లు తెలిసింది. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు, జలవనరుల శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
చెరువుల్లో యథేచ్ఛగా
తుమ్మ చెట్ల నరికివేత
రూ.లక్షల్లో అక్రమార్జన
జలవనరులశాఖ అధికారులు
పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు
అమరాపురం మండలం హేమావతి గ్రామ పంచాయతీలోని పురవరం మైనర్ ఇరిగేషన్ చెరువులో పడి ఉన్న తుమ్మ చెట్ల దుంగలివి. చెరువులోని తుమ్మ చెట్లను కొంత మంది అక్రమార్కులు యథేచ్ఛగా నరికి సొమ్ము
చేసుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చెట్ల నరికివేత
ఇష్టారాజ్యంగా సాగుతోంది. ఇంత జరుగుతున్నా అక్రమార్కులపై
జలవనరులశాఖ అధికారులు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు.


