గుడిబండ: రైతులు పట్టు పరిశ్రమ వైపు దృష్టి సారించాలని, శాసీ్త్రయ పద్ధతులు అవలంబిస్తే పట్టు పురుగుల పెంపకంలో అధిక లాభాలు పొందవచ్చని జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారి శోభారాణి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని బీటీ పల్లిలో మల్బరీ సాగుపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ రైతులు మల్బరీ సాగు, పురుగుల యాజమాన్యం, ఆధునిక పద్ధతులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. నాణ్యమైన గుడ్లను ఉత్పత్తి చేసి అధిక లాభాలు పొందవచ్చునని తెలియజేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాన్నారు. మల్బరీలో నేచురల్ ఫార్మింగ్, పట్టు పురుగుల పెంపకంలో మెలకువలను వివరించారు. కార్యక్రమంలో ఏడీ హనుమంతరాయప్ప, ఆర్‌ఎస్‌ఆర్‌ఎస్ శాస్త్రవేత్త రమ్య, ఏఎస్‌ఓ సరోజిని, సిబ్బంది పాల్గొన్నారు.
చికిత్స పొందుతూ
యువతి మృతి
తాడిమర్రి: పురుగుల మందు తాగిన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండలంలోని నిడిగల్లు గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. నిడిగల్లు గ్రామానికి చెందిన జవాబు వీరయ్య, ఓబుళమ్మ దంపతుల కుమార్తె రేణుక (36) పదో తరగతి వరకు చదివింది. తండ్రి పదేళ్ల క్రితం మృతి చెందడంతో టైలర్ పని నేర్చుకుని కుటుంబానికి చేదోడుగా ఉండేది. వయసు మీద పడుతున్నా వివాహం కాలేదని మనస్తాపం చెందిన ఆమె గత నెల 26న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడిన రేణుక నాలుగు రోజుల తర్వాత సోదరుడు మోహన్‌కు మందు తాగిన విషయం తెలిపింది. దీంతో వారు వెంటనే 108 వాహనంలో బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తరలించి, ప్రాథమిక చికిత్స అనంతరం అనంతపురంలోని ఓ ప్రవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న రేణుక మంగళవారం ఉదయం ఉదయం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.
కుక్కల దాడిలో
గొర్రె పిల్లల మృతి
మడకశిరరూరల్: మండల పరిధిలోని జమ్మానిపల్లిలో ఇంటి ఆవరణంలోని గొర్రెల పాకలోకి కుక్కలు ప్రవేశించి ఏడు పిల్లలపై దాడి చేసి చంపేశాయని బాధిత గొర్రెల కాపరి శేషప్ప ఆవేదన వ్యక్తం చేశాడు. శేషప్ప మంగళవారం ఉదయం గొర్రె పిల్లలకు మేత వేసి కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లాడు. ఈ క్రమంలోనే కుక్కలు 7 పిల్లలపై దాడి చేసి చంపి వేశాయి. రూ.40 వేల నష్టం జరిగిందని బాధిత రైతు వాపోయాడు. ప్రభుత్వం న్యాయం చేయాలని కోరాడు.


