ధర్మవరం అర్బన్: ‘అర్హులైన చేనేత కార్మికులకు రూ.25 వేలు డబ్బులు వేయకుండా అనర్హులకు వేశారు. నిజమైన చేనేత కార్మికులకు అన్యాయం చేశారు. ఆగస్టు 15వ తేదీలోపు అర్హులైన చేనేత కార్మికుల అకౌంట్లలోకి నేతన్న పథకం కింద రూ.25 వేలు జమ చేయాలి. లేకపోతే స్వాతంత్య్ర దినోత్సవం రోజున పురుగుల మందు డబ్బాలతో ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తాం’అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ధర్మవరం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు మంగళవారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేనేత కార్మికులు ధర్నా చేపట్టారు. వారికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధర్నాలో పాల్గొన్నారు.
అందరూ వాటాలు పంచుకున్నారు
ఈ సందర్భంగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ధర్మవరం నియోజకవర్గంలోనే 15 వేల మందికి నేతన్న నేస్తం పథకాన్ని వర్తింపజేశామని, ప్రస్తుతం కేవలం 6 వేల మందికి మాత్రమే అందించారన్నారు. నీకు సగం, నాకు సగం అంటూ అధికారులు, నాయకులు నేతన్న పథకం డబ్బులు పంచుకున్నారన్నారు. అనర్హులకు పథకాన్ని వర్తింపచేసిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్హులైన చేనేత కార్మికులకు డబ్బులిచ్చే వరకు పోరాడుతూనే ఉంటామన్నారు. అనర్హులకు డబ్బులేసి తప్పు చేసిన ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. మంత్రి సత్యకుమార్‌యాదవ్ కేవలం మీటింగుల్లో గొప్పలు చెబుతుంటారని, ఆచరణలో మాత్రం ఏవీ కావన్నారు. కుల, మత, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ నేతన్న నేస్తం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. నేతన్నలకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెబుతున్నారని, మరి ఉచిత కరెంటు ఇస్తున్న కార్మికులకు డబ్బులు ఎందుకు పడలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ధర్మవరంలో 52 మంది చేనేత కార్మికులు ఉరి వేసుకుని ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఇప్పటికైనా వెంటనే హ్యాండ్‌లూమ్ అధికారులను పిలిపించి అర్హులకు న్యాయం చేయాలన్నారు. అనంతరం ఆర్డీఓ రాంభూపాల్‌రెడ్డికి అర్హులైన చేనేత కార్మికుల జాబితాలను అందించారు. ధర్నాలో వైఎస్సార్‌సీపీ చేనేత నాయకులు కాచర్ల అంజి, గడ్డం రంగ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకుడు చందమూరి నారాయణరెడ్డి, మాసపల్లి సాయికుమార్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పెద్దిరెడ్డి గారి శ్రీనివాసులు, మైనార్టీ నాయకులు షేక్ చాంద్‌బాషా, పట్టణాధ్యక్షుడు కోటిరెడ్డి బాలిరెడ్డి, చెలిమి పెద్దన్న, శంకర్ తేజ, కత్తె పెద్దన్న, జింకా కంబగిరి, బ్రహ్మయ్య, యల్లయ్య, దేవరకొండ రమేష్, కడప రంగస్వామి, శివ, గుండా ఈశ్వరయ్య, చేనేత కార్మికులు పాల్గొన్నారు.
నేతన్న నేస్తం పథకాన్ని
అర్హులందరికీ వర్తింపజేయాలి
లేకపోతే 15న పురుగుల మందు డబ్బాలతో ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తాం
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి


