పుట్టపర్తి అర్బన్: బాలికలు విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను ఎంపిక చేసుకొని ముందుకెళ్లాలి. అప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత, కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్, పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీత , ప్రముఖ అథ్లెట్ మాలతీ, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పుట్టపర్తి మండలం మామిళ్లకుంట క్రాస్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ‘బాలికే భవిష్యత్తు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థినులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సవిత మాట్లాడుతూ విద్యార్థినులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని సమాజంలో ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. బాల్య వివాహాలను అడ్డుకోవడం సమష్టి బాధ్యతన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ బాలికలు ఎట్టి పరిస్థితుల్లోనూ చదువును మధ్యలో ఆపకుండా ఉన్నత చదువులను అభ్యసించాలన్నారు. జిల్లాలో డ్రాపౌట్స్ పెరుగుతుండడం, బాల్య వివాహాలు, టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇప్పటి వరకూ జిల్లాలో 156 బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు చెప్పారు. ఎస్పీ మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులు, సోషల్ మీడియాకు లొంగిపోయి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. అత్యవసర సమయాల్లో 112 టోల్ ఫ్రీ నంబర్‌ను ఉపయోగించుకోవాలన్నారు. అనంతరం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఎస్పీ అంకితా సురానా, ఆర్డీఓ సువర్ణ, ఐసీడీఎస్ పీడీ ప్రమీల, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజబేగం, డీఈఓ కిష్టప్ప, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, విద్యార్థినులు పాల్గొన్నారు.


