ధర్మవరం అర్బన్: ప్రజా రక్షణకే పోలీసుశాఖ అధిక ప్రాధాన్యం కల్పిస్తోందని ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి ఎస్పీ సతీష్‌కుమార్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రధాన రహదారులు, బీట్ పాయింట్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌ను పరిశీలించి విధుల్లో ఉన్న సిబ్బంది పనితీరు, నైట్ బీట్, పెట్రోలింగ్, వైర్లెస్ కమ్యూనికేషన్, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానాన్ని సమీక్షించారు. అనంతరం కాలేజీ సర్కిల్‌లో పోలీసుల గస్తీ, పెట్రోలింగ్ వాహనాల కదలికలను పరిశీలించారు. రాత్రివేళల్లో సంచరిస్తున్న వ్యక్తులు, వాహనాల వివరాలను తెలుసుకున్నారు. ప్రధాన రహదారులు, వ్యాపార సముదాయాలు, బ్యాంకులు, ఏటీఎంలు, దేవాలయాలు, ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో నైట్‌బీట్, పెట్రోలింగ్‌ను మరింత పటిష్టంగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. రాత్రివేళల్లో అత్యవసర పరిస్థితులు మినహా అనవసరంగా బయట సంచరించకూడదని ప్రజలకు సూచించారు.
అభివృద్ధి, సంక్షేమంలో
మంచి ఫలితాలు సాధించాలి
ప్రశాంతి నిలయం: జిల్లాలో అభివృద్ధి, సంక్షేమం రెండింటిలోనూ మంచి ఫలితాలు సాధించి, లక్ష్యాలను పూర్తి చేసేలా ఆయా శాఖల అధికారులు పనిచేయాలని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ వివిధ శాఖల జిల్లా, మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులకు కీలక అంశాలపై దిశా నిర్దేశం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ పత్రికలు, సోషల్ మీడియాలో వచ్చే ప్రతికూల కథనాలపై అధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయి వాస్తవ నివేదికలతో సమగ్ర వివరణ ఇవ్వాలన్నారు. ఎన్‌నినో పరిస్థితుల దృష్ట్యా పశువులకు తాగునీరు, పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. 15న జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు. అనధికారిక లేఔట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు మోసపోకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు.
అలరించిన సంగీత కచేరీ
ప్రశాంతి నిలయం: సత్యసాయిపై భక్తి భావనను చాటుతూ జమ్మూ కాశ్మీర్ భక్తులు పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేశారు. మంగళవారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహా సమాధి చెంత ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సత్యసాయిని కీర్తిస్తూ సంగీత కచేరి సాగింది. చక్కటి భక్తిగీతాలతో వారు నిర్వహించిన సంగీత కచేరి భక్తులను మైమరపింపజేసింది. తర్వాత భక్తులు సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు.


