బత్తలపల్లి: మండల పరిధిలోని డి.చెర్లోపల్లి–చిన్నేకుంటపల్లి రైల్వేస్టేషన్ మధ్య రైలు నుంచి కిందపడి తూర్పుగోదావరి జిల్లా వాసి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం గోల్లకొట్టూరిపాలెం గ్రామానికి చెందిన వీరవెంకటదుర్గాప్రసాద్ (36) పెనుకొండ సమీపంలో మరిమాకుల పల్లి వద్ద ఉన్న సోలార్ ప్లాంట్‌లో కూలీగా పని చేస్తున్నాడు. ఆయనకు పెళ్లి కాలేదు. ఈ నెల 9న ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ధర్మవరం నుంచి నర్సాపూర్ రైలులో స్వగ్రామానికి బయలుదేరాడు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. అయితే 2.50 నిమిషాలకు వీరవెంకటదుర్గాప్రసాద్ ఫోన్ స్విచాఫ్ అయింది. మంగళవారం మధ్యాహ్నం రైల్వే గ్యాంగ్‌మెన్ శంకర్ డి.చెర్లోపల్లి–చిన్నేకుంటపల్లి రైల్వేస్టేషన్ మధ్య పట్టాలపై వెళుతుండగా ముళ్లపొదల్లో పడి ఉన్న వీరవెంకటదుర్గాప్రసాద్ మృతదేహాన్ని చూసి ఎస్‌ఎంఆర్‌కు సమాచారం అందించాడు. రైల్వే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా.. మరేమైనా కారణాలున్నాయా అనేది విచారణలో తెలియాల్సి ఉంది.
ఎర్ర చందనం దుంగల స్వాధీనం.. ఒకరి అరెస్టు
తలుపుల: మండలంలోని సంగటివారిపల్లి సమీపంలోని కోలేకనుమ వద్ద కారులో నాలుగు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకన్నట్లు ఎఫ్‌ఎస్‌ఓ బ్రహ్మయ్య తెలిపారు. ఆయన తెలిపిన మేరకు.. ముందస్తు సమాచారంతో కోలేకనుమ వద్ద ఆదివారం రోడ్డుపై అధికారులు కాపు కాశారు. ఈ క్రమంలోనే కడప నుంచి బెంగుళూరుకు ఇన్నోవా కారులో ఎర్ర చందనం దుంగలు తరలిస్తుండగా పట్టుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం లింగాల దిన్నెకు చెందిన బంగారురెడ్డి పట్టుబడగా, మిగిలిన ఇద్దరు పారిపోయారు. కారును కదిరి అటవీ కార్యాలయానికి తరలించారు. నిందితుడిని మంగళవారం తిరుపతి ఎర్రచందనం కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించినట్లు ఎఫ్‌ఎస్‌ఓ తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్‌బీఓలు నరసింహమూర్తి, స్రవంతి పాల్గొన్నారు.
గుర్తు తెలియని
మృతదేహం లభ్యం
ముదిగుబ్బ: మండల పరిధిలోని మలకవేమల గ్రామ సమీపంలోని పెంకల గేట్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద మంగళవారం గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. మతిస్థిమితం లేని వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుని ఆచూకీ తెలిస్తే 9346010561 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.


