పెనుకొండ రూరల్: బెహలూల్ షా బాబా గంధం వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం తెల్లవారుజామున పీఠాధిపతి షెక్షావలి తన ఇంటి వద్ద తలపై గంధం ఉంచుకుని బయలుదేరి జాతీయ రహదారి పక్కన ఉన్న దర్గాలో స్వామి వారి సమాధి వద్ద సమర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో దర్గా ప్రాంతం కిటకిటలాడింది. పకీర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. గురువారం దీపారాధనతో ఉరుసు ముగియనుంది. రెండు రోజుల పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు దర్గా కమిటీ సభ్యులు అన్నదానం ఏర్పాటు చేశారు. ఉచిత కంటి వైద్య శిబిరంలో అవసరమైన వారికి అద్దాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ, వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి అన్సర్, ఏజీపీ భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఎయిడ్స్‌పై అవగాహన
కలిగి ఉండాలి
పుట్టపర్తి టౌన్: ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ సతీష్‌కుమార్ సూచించారు. ప్రపంచ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ కార్యాలయంలోని తన చాంబర్‌లో ఎస్పీ సతీష్ కుమార్ పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే సామాజిక స్పృహ కలిగి ఉండాలన్నారు. ఇంటింటి ప్రచారంతో పాటు అవగాహన సమావేశాలు, కళాజాత, ఎల్‌ఈడీ వ్యాన్ల ద్వారా పాఠశాలలు, కళాశాలలతో పాటు గ్రామాల్లో వైద్య సిబ్బంది అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పోలీసుల సహకారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎయిడ్స్, క్షయ నియంత్రణ జిల్లా అధికారి అనుపమ జేమ్స్, ప్రాజెక్ట్ మేనేజర్ ఆంజనేయులు, ఏఎన్‌ఎం హరిత తదితరులు పాల్గొన్నారు.
ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శిగా రామక్రిష్ణ
పుట్టపర్తి: ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శిగా బుక్కపట్నం డైట్ కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్బర రామక్రిష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ తమామి అన్సారీ నుంచి నియామక పత్రం అందింది. దీంతో బుధవారం డైట్ కళాశాలలో సంబరాలు జరుపుకున్నారు.
విద్యార్థులు క్రీడల్లోనూ
రాణించాలి
ధర్మవరం అర్బన్: విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్‌రాజు, జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు సోమేశ్వర్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో బుధవారం అమరావతి ఛాంపియన్‌షిప్ కప్–2026 జిల్లాస్థాయి క్రీడా పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గాజుల సోమేశ్వర్‌రెడ్డి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్, హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు బంధనాథం సూర్యప్రకాష్ క్రీడా పోటీలను ప్రారంభించారు. 500 మంది క్రీడాకారులు హాకీ, యోగా, బాస్కెట్‌బాల్, చెస్, ఆర్చరీ, బాక్సింగ్ క్రీడల్లో సత్తా చాటారు. పోటీల్లో ప్రతిభ కనబరచిన క్రీడాకారులు త్వరలో రాష్ట్రస్థాయిలో జరిగే పోటీలలో పాల్గొననున్నారని వారు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ కార్యదర్శి అంజన్న, వ్యాయామ ఉపాధ్యాయులు రామకృష్ణ, కృష్ణమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం సిటీ: మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (మహిళ) కోర్సుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రెండేళ్ల కాల వ్యవధి ఉన్న ఈ కోర్సులో చేరేందుకు ఇంటర్‌లో ఏ బ్రాంచ్‌లోనైనా ఉత్తీర్ణత సాధించిన మహిళలు అర్హులు. వయోపరిమితి లేదు. ఆసక్తి ఉన్నవారు http://cfw.apnic.in బ్‌సైట్ ద్వారా డౌన్‌లోడు చేసుకున్న దరఖాస్తులను భర్తీ చేసి సెప్టెంబర్ 30వ తేదీలోపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో అందజేయాలి.


