ప్రశాంతి నిలయం: జిల్లా వ్యాప్తంగా పీఎం సూర్యఘర్ పథకం అమలుపై కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గడువులోపు లక్ష్యాలు సాధించకపోతే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టపర్తి డివిజన్‌లో 500, కదిరి–500, హిందూపురం డివిజన్‌లో 600 మొత్తంగా 1,600 సోలార్ ప్యానెళ్లు అమర్చే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. వ్యవసాయ రంగానికి అనువుగా ఉండే పీఎం కుసుమ్ పథకంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వినియోగదారుల్లో సోలార్ విద్యుత్‌పై అవగాహన పెంపొందించేందుకు స్వయం సహాయక సంఘాల సహాయం తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ మోసెస్, పలువురు ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.
నాణ్యమైన వైద్య సేవలు అందించాలి
ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగేలా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య రంగంలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా అధికారులు పని చేయాలన్నారు. మాతాశిశు మరణాలను తగ్గించడం కోసం గర్భిణులు, బాలింతలకు క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించాలన్నారు. క్షయ రహిత సమాజ నిర్మాణం కోసం జాతీయ క్షయ నివారణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ఎయిడ్స్ నివారణకు ప్రజల్లో విస్తృత అవగాహన కలిగించాలని ఆదేశించారు. అనుమతులు లేకుండా మందులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఔషధ నియంత్రణ అధికారులను ఆదేశించారు. బాలికలకు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఫైరోజా బేగం, ఎన్టీఆర్ వైద్య సేవల కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు


