ధర్మవరం అర్బన్: భవిష్యత్తులో స్నేహితుడే తనకు హాని చేస్తాడని అనుమానించిన ఓ వ్యక్తి అతడిని హతమార్చాడు. పట్టణంలో ఇటీవల హత్యకు గురైన బోయ దాసరి శ్రీనివాసులు కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం డీఎస్పీ జగన్నాథరాజు వివరాలు వెల్లడించారు. ధర్మవరం మండలం ఓబుళనాయనపల్లికి చెందిన గడిపూడి గంగాధర్‌నాయుడు, దాసరి శ్రీనివాసులు చిన్ననాటి స్నేహితులు. శ్రీనివాసులు వాహనాన్ని ఒకటిన్నర సంవత్సరం క్రితం గంగాధర్‌నాయుడు తీసుకెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. అనంతరం వాహనానికి మరమ్మతులు చేయించి తిరిగి ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. తన కదలికలపై శ్రీనివాసులు ఆరా తీస్తున్నాడని గంగాధర్‌నాయుడుకు అనుమానం వచ్చింది. భవిష్యత్తులో ఆయన నుంచి హాని తప్పదని అనుమానించి చంపాలని నిర్ణయించుకున్నాడు. తన అనుచరులైన ఓబుళనాయనపల్లికి చెందిన బాల చరణ్‌కుమార్, గుజ్జల గంగాధర్‌కు చెప్పి హత్యకు పథక రచన చేశాడు. ఈ నెల 8న అర్ధరాత్రి సమయంలో తన థార్ వాహనంలో బాల చరణ్‌కుమార్, గుజ్జల గంగాధర్‌తో కలిసి శ్రీనివాసులును ధర్మవరం చెరువు రెండో మరువ ప్రాంతానికి తీసుకెళ్లాడు. శ్రీనివాసులుకు మద్యం తాగించిన అనంతరం వెంట తెచ్చుకున్న కర్రతో వెనుకవైపు నుంచి ముగ్గురూ దాడి చేశారు. కిందపడిన శ్రీనివాసులుపై అక్కడే ఉన్న బండరాయితో మోది హతమర్చారు. అనంతరం మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి చెరువులో పడేసి పరారయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ నెల 11న ధర్మవరం మండలం గొల్లపల్లి వంక బ్రిడ్జి సమీపంలో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి థార్ వాహనం, బజాజ్ పల్సర్ బైకు, మూడు సెల్‌ఫోన్లతో పాటు హత్యకు ఉపయోగించిన బండరాయిని స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. త్వరితగతిన కేసును ఛేదించిన సీఐలు రెడ్డెప్ప, జయనాయక్, ప్రభాకర్‌గౌడ్, అలి, ఎస్‌ఐ వీరేష్, పోలీసు సిబ్బందిని ఎస్పీ సతీష్‌కుమార్ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు.
వీడిన హత్య కేసు మిస్టరీ
మృతుడి స్నేహితుడితో పాటు
ఇద్దరి అరెస్టు


