ప్రశాంతి నిలయం: జిల్లా పరిధిలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో జరుగుతున్న భూసేకరణ, పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు ఇద్దరు అధికారులను జిల్లాకు బదిలీ చేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జిల్లా ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్‌గా పని చేస్తున్న జి.రామకృష్ణారెడ్డిని వాణిజ్య, పరిశ్రమలశాఖ పుట్టపర్తికి జోనల్ మేనేజర్‌గా బదిలీ చేశారు. అలాగే రాష్ట్ర భూ పరిపాలనా విభాగంలో అసిస్టెంట్ సెక్రెటరీగా పనిచేస్తున్న ఎస్.మహబూబ్‌బాషాను వాణిజ్య, పరిశ్రమలశాఖ పుట్టపర్తికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు. పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో జరుగుతున్న భూసేకరణ, పారిశ్రామిక అభివృద్ధి పనులను వీరు పర్యవేక్షించనున్నారు.


